Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని అంచనావేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ఆదివారంనాడాయన ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారులతో రాష్ట్రంలో జరిగిన పంట నష్టంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు ఆదేశాలు జారీ చేశారు. రైతులు, కౌలురైతుల వివరాలను వేర్వేరుగా నమోదు చేయాలని సూచించారు. వారికి అండగా ప్రభుత్వం ఉన్నదనే భరోసా కల్పించాలనీ, నష్టం అంచనాలు వెల్లడయ్యాక, నేరుగా రైతులు, కౌలురైతుల బ్యాంకు ఖాతాల్లోకి పంటనష్టం సొమ్ము వెళ్లేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. కరీంనగర్, చొప్పదండి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ సహా అన్ని ప్రాంతాల నుంచి పంటనష్టం అంచనాలు సాధ్యమైనంత త్వరగా తెప్పించాలని ఆయన సీఎస్‌ను ఆదేశించారు. ఏయే పంటలకు ఎన్ని ఎకరాల్లో నష్టం జరిగిందో స్పష్టంగా నమోదు చేసి, కేంద్రానికి కూడా సమాచారం ఇవ్వాలని చెప్పారు. కేంద్రం నుంచి కూడా పంటనష్టం సాయం అందేలా పాలనాపరమైన అంశాలను పూర్తిచేయాలని అన్నారు. కేంద్రం పంటనష్టం ఇచ్చినా, ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతులు, కౌలురైతుల్ని ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తక్షణం ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి నివేదికలు తెప్పించి, వాటిని క్రోడీకరించి ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.