Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నది'ని కాల్వగా మార్చారు
- ప్రభుత్వమే అతిపెద్ద ఆక్రమణదారు
- ఎస్టీపీలు పనిచేయట్లేదు
- విషతుల్యంగా నీరు... వాటితోనే పంటలు
- 'నగర్-నది' నివేదిక విడుదల చేసిన పీఆర్సీ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, ఇక్కడే కలిసిపోయే అపూర్వ చరిత్ర కలిగిన మూసీ నది విషతుల్యంగా మారిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. మూసీలో అతిపెద్ద ఆక్రమణదారు ప్రభుత్వమేనని విమర్శించారు. సహజంగా పారే నదిని కాల్వలాగా మార్చేశారనీ, దీనివల్ల జీవవైవిధ్యం అసమతుల్యమవుతున్నదని చెప్పారు. ఢిల్లీకి చెందిన పీపుల్స్ రిసోర్స్ సెంటర్ (పీఆర్సీ) ఆధ్వర్యాన సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 'నగర్-నది' పేరుతో మూసీనదిపై నివేదికను విడుదల చేశారు. ఈ పరిశోధనా నివేదికను మానవహక్కుల వేదిక ప్రతినిధి సంజరు రూపొందించారు.
పీపుల్స్ రిసోర్స్ సెంటర్ అధ్యక్షులు రాజేంద్ర రవి, జాయింట్ ఆక్షన్ ఫర్ వాటర్ ప్రతినిధి డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ జీవన్ కుమార్, సేవ్ రివర్స్ ఫోరమ్ ప్రతినిధి డాక్టర్ టీ ఇంద్రసేనారెడ్డి, హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కే వీరయ్య, మూసీ పరీవాహక ప్రాంత నివాసి పిట్టల శ్రీశైలం తదితరులు మాట్లాడారు. మూసీ నదిలోని మురుగునీటిని శుద్ధి చేసేందుకు 17 ఎస్టీపీలు ఏర్పాటు చేశారనీ, వాటిలో ఇన్‌టేక్ వివరాలు చెప్తున్నారే తప్ప, ఔట్‌ఫ్లో వివరాలు లేవన్నారు. ఎస్టీపీలు సక్రమంగా పనిచేయకపోవడంతో ప్రమాదకరమైన విష రసాయనాలు భూమిలో ఇంకి, భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వివరించారు. ఈ నీటితో పండిస్తున్న పంటల వల్ల ప్రజలు అనారోగ్యాలబారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 269 కిలోమీటర్ల మూసీనదితో 90 గ్రామాలు అనుసంధానమై ఉన్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో కల్లు రుచి కూడా మారిపోయేంత గాఢతతో ప్రమాదఘంటికలు మోగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. జీవవైవిధ్యం విచ్ఛిన్నమై పశువులు గర్భం దాల్చట్లేదనీ, కులవృత్తులు ధ్వంసమవుతున్నాయని తెలిపారు. మురుగు నీటి శుద్ధి కేంద్రాలను వికేంద్రీకరించాలనీ, భవన నిర్మాణ నిబంధనల్లో మార్పులు చేయాలనీ, బహుళ అంతస్తుల భవనాల్లో మూడు నీటి పైపుల విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. మూసీ ఆక్రమణల్ని తొలగించకుంటే భవిష్యత్‌లో భాగ్యనగరవాసులు మరిన్ని ప్రకృతి వైపరీత్యాలకు గురి అవుతారని హెచ్చరించారు. పర్యావరణ సమతుల్యత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేననీ, ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.