Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తొలగించాం
- 14 లక్షల ఎకరాల నుంచి 54 లక్షలకు వరి సాగు పెంచాం
- బీజేపీకి డిపాజిట్ రాదు.. కాంగ్రెస్ పాలన అవినీతిమయం
- ఎవరెన్ని ట్రిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
- బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు
నవతెలంగాణ - కల్లూరు
మూడు నెలల్లో సీతారామ ఎత్తిపోతల పథకం నీళ్లు ప్రజల దరిచేరుస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో కరువు అనే పదాన్ని డిక్షనరీలో లేకుండా చేశామన్నారు. 14 లక్షల ఎకరాలుగా ఉన్న వరి సేద్యాన్ని 54 లక్షలకు పెంచామన్నారు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి డిపాజిట్ దక్కే అవకాశమే లేనప్పుడు రాష్ట్రంలో ఎలా అధికారంలోకి వస్తుందని ఎద్దేవా చేశారు. స్థానిక శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన సోమవారం ఖమ్మం జిల్లా కల్లూరులో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ముందుకు నడిపిస్తుంటే ఓర్వలేక బీజేపీ అబద్ధాలతో నిజాన్ని కనుగుమరుగు చేయాలని చూస్తుందన్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కరువు కాటకాలతో అల్లాడి పోయిందని తెలిపారు. 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, సాగునీరు, పండించిన ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయడంతో రాష్ట్రంలో వ్యవసాయం వృద్ధిలోకి వచ్చిందని చెప్పారు. బీజేపీ రబీలో ధాన్యాన్ని కొనలేమని చేతులెత్తేసినా రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక భూమి విలువ పెరగడంతో పాటు పంట విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును విస్తరింపచేస్తున్నామన్నారు. కర్నాటకలో ఓడిపోతామని, తెలంగాణలో ఏమి అధికారం సాధిస్తామనే ప్రెస్టేషన్తోనే బీజేపీ ఇష్టానుసారంగా మాట్లాడుతుందన్నారు. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలకు మోకరిల్లితే.. బీజేపీ గుజరాత్ పెద్దలకు గులాం చేస్తుందని విమర్శించారు. పేపర్ లీకేజీ విషయంలో బెయిల్ మీద వచ్చిన వాళ్లను పక్కన పెట్టుకొని మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. కాంగ్రెస్ అంటేనే లంచాలు, అవినీతి పార్టీ అన్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ రద్దు చేసి రాష్ట్రాన్ని దోచుకుంటారని ఆరోపించారు. ఎవడు ఎన్ని ట్రిక్కు లేసినా కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. రెండు, మూడు నెలల్లో సీతారాం ప్రాజెక్ట్ నీరు సత్తుపల్లి గడ్డకు తీసుకువచ్చి రైతుల కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటామన్నారు.
ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది నుంచి వైద్య కళాశాల : మంత్రి అజరు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ విద్యా సంవత్సరం నుంచి వైద్య కళాశాల ప్రారంభమవుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరుకుమార్ తెలిపారు. కేసీఆర్ పేద ప్రజల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ విద్యా వైద్యాన్ని అభివృద్ధి చేస్తూ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. సత్తుపల్లిలో వంద పడకలు, పెనుబల్లిలో 50 పడకలు, కల్లూరులో 50 పడకల ఆస్పత్రుల నిర్మాణాలు చేపట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. సండ్ర వెంకట వీరయ్య మూడుసార్లు గెలిచి సత్తుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలు టీఆర్ఎస్ గెలుస్తుందని దీమా వ్యక్తం చేశారు. సభలో బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, జడ్పీ చైర్మెన్ లింగాల కమలరాజ్ తదితరులు ప్రసంగించారు.