Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ డెత్ సర్టిఫికేట్లతో దందా
- కార్మిక శాఖ ఉద్యోగుల పాత్రపైనా అనుమానాలు
- ఏడాదిలోనే 40,900 మంది కార్మికులు చనిపోయారంట
- ఎనిమిదేండ్లలో రూ.531 కోట్ల ఖర్చు.. ఈ ఏడాది రూ.1,417 కోట్ల వాడకం
- వెల్ఫేర్బోర్డులో వందల కోట్ల రూపాయల అవినీతి
- ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 80 మరణాలపై అనుమానాలు
- 15 దరఖాస్తులు విచారిస్తే అన్నీ ఫేక్ మరణాలే
- వరంగల్ జిల్లాలోనే 25 కోట్ల దుర్వినియోగం
- ఆర్టీఐ యాక్టు ద్వారా వెలుగులోకి తెచ్చిన సీపీఐ(ఎం)
నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలతో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సొమ్ము దొడ్డిదారిన స్వాహా అవుతున్నది. నిర్మాణ సంస్థల నుంచి సెస్ వసూళ్ల విషయంలోనే కాకుండా కార్మికుల సంక్షేమం కోసం పెడుతున్న ఖర్చుల్లోనూ పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు తెలుస్తున్నది. తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు(టీబీఓసీడబ్ల్యూడబ్ల్యూ) ద్వారా తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కార్మికుల సంక్షేమం కోసం ఎనిమిదేండ్ల కాలంలో రూ.531 కోట్లు ఇవ్వగా...2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి వరకు రూ.1417 కోట్ల ఖర్చుపెట్టారు. ఇదే విషయం ఇప్పుడు అక్కడ జరుగుతున్న అవినీతి బాగోతాన్ని ఎత్తిచూపుతున్నది. ఏడాదిలో 40,900 మంది కార్మికులు చనిపోయారంటూ కార్మిక శాఖ లెక్కలు చూపెట్టడమే విస్తుగొల్పుతున్నది.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా అసెంబ్లీకి కార్మిక శాఖ సమర్పించిన లెక్కల్లో వివిధ సంక్షేమ పథకాల కింద అయిన ఖర్చు రూ.300 కోట్లుగా చూపెట్టారు. సమాచార హక్కు చట్టం ద్వారా కార్మిక శాఖ ఇచ్చిన దాని ప్రకారమైతే రూ.1417 ఖర్చుపెట్టినట్టు ఉంది. రెండూ ప్రభుత్వ లెక్కలే. ఎందుకీ వ్యత్యాసం మిగతా డబ్బులేమైనట్టు అనే విషయం తేలాల్సి ఉంది. నిధుల స్వాహాలో అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఫీల్డు విజిట్‌లో అన్నీ బోగసే...
సూర్యాపేట జిల్లాలో 80 డెత్ క్లయిమ్స్‌పై వెల్ఫేర్ బోర్డుకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ కోసం వెల్ఫేర్ బోర్డు కొందరు అధికారులను ఫీల్డు విజిట్‌కు పంపగా 15 దరఖాస్తులను వారు పరిశీలించారు. చివ్వెంల, ఆత్మకూరు మండలాల్లోని రాజుతండా, పాండ్యానాయక్ తండా, మున్యానాయక్ తండా, తుమ్మల పెన్‌పహాడ్, రామోజీ తండాలలో అధికారులు పర్యటించారు. ఆయా గ్రామపంచాయ తీల్లో ఏడాది కాలంలో జారీ అయిన మరణ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. చివ్వెంల మండ లంలోని మున్యా నాయక్ తండాలో ఐదు మర ణాలపై విచారణ జరపగా ...అసలు ఆ గ్రామ పంచా యతీ ఆ పేర్లతో మరణ ధ్రువీ కరణ పత్రాలే ఇవ్వ లేదని తేలిం ది. ఆత్మ కూరు (ఎస్) మండలం లోని తుమ్మల పెన్ పహా డ్ పంచాయతీ పరి ధిలో నలుగురి పేరిట నిధులను స్వాహా చేశారు. దీనిపై గ్రామ పంచా యతీలో విచారణ జరపగా... అధికారులు చూపెట్టినవన్నీ నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలని తేలింది. చివ్వెంల మండలం పాండ్యా తండాలో నాలుగు మరణాలపై విచారణ జరపగా..అవీ ఫేక్ సర్టిఫికేట్ల ద్వారానే నిధులను పక్కదోవ పట్టించినట్టు వెల్లడైంది. సూచనప్రాయంగా అధికారులు 15 మరణాలపై విచారణ జరపగా..అన్నీ ఫేక్ అని తేలడం విస్తుగొల్పే అంశం. బోగస్ డెత్ సర్టిఫికేట్లు, బోగస్ ఎఫ్ఐఆర్లు, బోగస్ డాక్యుమెంట్లతో కొందరు దళారులు, మీసేవ కేంద్ర నిర్వాహకులు, బోర్డు కార్యాలయంలోని కొందరు ఉన్నతాధి కారుల ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఏడాదిలోనే 40,900 మంది కార్మికులు చనిపోయారా?
ఒక్క ఏడాదిలోనే 40,900 మంది భవన నిర్మాణ కార్మి కులు చని పోయారా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. బోర్డు ద్వారా బాధిత కుటుం బాలకు రూ. 525 కోట్లు ఇచ్చారు. 14 నెలల కాలంలో వివిధ ప్రమాదాల్లో 4027 మంది కార్మికులు చనిపోయినట్టు, 313 మంది అంగవైకల్యం పొందినట్టు సమాచార హక్కు చట్టం కింద ఇచ్చిన పత్రాల్లో ఉంది. వారి కోసం రూ.260 కోట్లు చెల్లించారు. ప్రసవ సహాయం కింద 1,38,250 మంది లబ్దిదారులకు రూ.415 కోట్లు ఇచ్చారు. పెండ్లీండ్ల కానుక కింద 71,661 మంది లబ్ది పొందారు. దీని కోసం రూ.215 కోట్లు ఖర్చుపెట్టారు. సూర్యాపేట జిల్లాలో శాంపిల్‌గా 15 మరణాలపై విచారణ జరిపితే అన్నీ ఫేక్ అని తేలాయి. వరంగల్ జిల్లాలో డెత్ క్లయిమ్ లబ్దిదారులకు రెండు సార్లు డబ్బులు చెల్లించడం వల్ల రూ.64 లక్షలు స్వాహా అయ్యాయి. వరంగల్ జిల్లాలో ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు చెల్లింపులు జరిపే విషయంలో రూ.25 కోట్లు దుర్వినియోగం జరిగింది.
హనుమకొండ జిల్లా పరకాలలో బోగస్ డెత్ క్లయిమ్స్‌పై దందా నడిపిస్తున్న ఓ అధికారి బంధువును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇవి బట్టబయలైనవే. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి అవినీతి పెచ్చుమీరిపోయినట్టు తెలుస్తున్నది.
ఖర్చు చూపెట్టింది ఇలా..
రాష్ట్రంలో టీబీఓసీడబ్ల్యూడబ్ల్యూ ద్వారా 2022 జనవరి నుంచి 2023 ఫిబ్రవరి మధ్య కాలంలో 2,56,000 మంది లబ్ది పొందారు. దీనికి గానూ వెల్ఫేర్ బోర్డు ఖర్చుపెట్టింది రూ.1,417 కోట్లుగా చూపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్మికుల సంక్షే మం కోసం పెట్టిన ఖర్చు రూ.256.85 కోట్లు మాత్రమే. మొత్తం 2014 నుంచి 2020 వరకు కార్మికుల సంక్షేమం కోసం రూ.531 కోట్లు వాడారు. అదే 2022-23కు వచ్చేసరికి అది రూ.1,417 కోట్లకు చేరడమే ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తున్నది. ఇంకో గమ్మతైన విషయమేమిటంటే రాష్ట్ర బడ్జెట్లో ఆ ఖర్చు రూ.300 కోట్లుగా చూపెట్టారు. ఇంత పెద్ద తేడా ఎందుకు వచ్చింది? అనూహ్యంగా ఏడాదిలో ఇంత ఖర్చు ఎలా పెరిగింది? నిజ మైన లబ్దిదారులకు డబ్బందిందా? బడ్జెట్లో చూపెట్టి న దానికంటే నాలుగురెట్లు అదనంగా ఎలా ఖర్చయింది? అన్న ప్రశ్నలకు కార్మిక శాఖ అధికారులే సమాధానాలు చెప్పాలి. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది.
కార్మిక శాఖలోని అవినీతి, అక్రమాలను తేల్చాలి
- ఎం.శ్రీనివాస్, సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి
రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీతో విచారణ జరిపించి కార్మిక శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను తేల్చాలని సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ(ఎం) నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.మహేందర్, ఎం.దశరథతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వెల్ఫేర్ బోర్డు ద్వారా లబ్దిదారులకు పంపిణీ చేస్తున్న నిధుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నదని తెలిపారు. తాము సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలే ఆవిషయాన్ని తెలుపుతున్నాయని వివరించారు. వెల్ఫేర్‌బోర్డు దళారుల కేంద్రంగా మారిందని విమర్శించారు. సూర్యాపేట జిల్లాలోని డెత్ సర్టిఫికేట్ల వ్యవహారం, వరంగల్ జిల్లాలో డబుల్ పేమెంట్ చెల్లింపు, మరణాల కేసుల ఇచ్చే చెల్లింపుల్లో రూ.25 కోట్ల అవినీతిని ఎత్తిచూపారు. పర్యవేక్షణా లోపంతో కార్మిక శాఖలో అవినీతి ఏటేటా పెరిగిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఏడాదిలోనే 1,417 కోట్ల రూపాయల నిధుల పంపిణీ వెనుక భారీ కుంభకోణం జరిగిందని విమర్శించారు. బోగస్ డాక్యుమెంట్లపై విచారణ జరిపితే అన్ని విషయాలు బట్టబయలు అవుతాయన్నారు.
ఈ కుంభకోణంలో వెల్ఫేర్బోర్డులో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేట్ పాత్ర ఉందనీ, ఆయనకు కార్మిక శాఖలోని ఉన్నతాధికారులతో సత్సంబంధాలున్నాయని విమర్శించారు. సెస్ వసూళ్లల్లో జరుగుతున్న అక్రమాలపై సీపీఐ(ఎం) బట్టబయలు చేసిందనీ, విజిలెన్స్ శాఖ విచారణలోనూ అది నిజమని తేలిందని చెప్పారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా రాష్ట్ర సర్కారు వాటిని అరికట్టడానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏసీబీతో విచారణ జరిపించి కార్మికులకు అందాల్సిన సొమ్మును కొల్లగొడుతున్న దళారులు, అధికారులను కఠినంగా శిక్షించాలి.