Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో నీటి సమస్యనా?
- ఔరంగాబాద్ సభలో బీఆర్ఎస్ అధ్యక్షులు సీఎం కేసీఆర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ గమనించాలి. ప్రజలకు తాగునీరు, సాగు నీరందించలేకపోవడానికి కారణమెవరు? గోదావరి, కృష్ణా వంటి నదులున్నా మహారాష్ట్రలో నీటి సమస్య ఎందుకు వస్తున్నది. ముంబయి దేశ ఆర్థిక రాజధాని కానీ తాగడానికి నీళ్లుండవు. అసలు దేశం పురోగమిస్తుందా? లేక తిరోగమిస్తుందా? అనే విషయాలపై ఆలోచించండి' అని బీఆర్ఎస్ అధ్యక్షులు, తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జబిందామైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశంలో పేదలు మరింత పేదలవుతున్నారని, ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారని అన్నారు. ఇదంతా మన కండ్లముందు జరుగుతుంటే ఇలాగే జరగాలా? చికిత్స చేయాలా? అని ప్రశ్నించారు. తన మాటలు విని ఇక్కడే మర్చిపోకండని, గ్రామాల్లోకెళ్లి చర్చ చేయాలని పిలుపునిచ్చారు. ఎంత త్వరగా మేల్కోంటే అంత త్వరగా దేశం బాగుపడుతుందని అన్నారు. సమస్యలకు పరిష్కారం లభించకుంటే ఏం చేయాలి? ఇకెంత కాలం పరిష్కారం కోసం ఎదురుచూడాలి? ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కల్పిస్తున్నా ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. భయపడుతుంటే ఇంకా భయపెట్టిస్తారని, ధైర్యంగా పోరాడితేనే పరిష్కారం లభిస్తుందని అన్నారు. మార్పు రాకుంటే దేశం ముందుకెళ్లదని, అనివార్యమైన మార్పు తీసుకురావడానికే బీఆర్ఎస్ పుట్టిందని వెల్లడించారు.. మార్పు వచ్చేవరకు బీఆర్ఎస్ పోరాటం ఆగదని, అన్ని వర్గాలకు న్యాయం దక్కాల్సిందేనని అన్నారు. దేశంలో నీటి వనరులు సమృద్ధిగా ఉన్నాయని కేసీఆర్ గుర్తుచేశారు. సాగుకు యోగ్యత ఉన్న భూములకు నీటిని అందించాల్సిన అవసరముందన్నారు. నిజాయితీగా బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి విజయం తథ్యమని కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకొస్తే ఐదేండ్లలోపు ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తామని చెప్పారు ఎన్ని అటంకాలు సృష్టించినా తమ పోరాటం ఆగదని, తెలంగాణలో తాగునీరు, సాగునీటి సమస్యలేకుండా చేశామని, అదే రీతిలో మహారాష్ట్రను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో అన్ని అందేలా ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఒక కులం, మతం, వర్గం కోసం బీఆర్ఎస్ ఆవిర్భవించలేదని, నిజాయితీగా పోరాడుతాం..విజయం సాధిస్తామని చెప్పారు. తెలంగాణలో ఉచిత విద్యుత్ సాధ్యమైనప్పుడు మహా రాష్ట్రలో ఎందుకు సాధ్యంకాదని ప్రశ్నించారు. దేశంలో కొత్త లక్ష్యాలు, సంకల్పంతో ముందుకెళ్లాలని, దేశంలో 24గంటలపాటు విద్యుత్ సరఫరా చేసే వనరులు న్నాయని చెప్పారు. దేశంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అవకాశ ముందని, ఇది అబద్ధమైతే ఒక్క నిమిషం కూడా సీఎం పదవిలో ఉండబోనని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు పరం చేస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ అధికారంలోకొచ్చిన తర్వాత వాటిని తిరిగి ప్రభుత్వపరం చేస్తామని అన్నారు. దేశంలోని సమస్యలను మనమే పరిష్కరించు కుందామని పిలుపునిచ్చారు. పాలనా సామర్థ్యం కల్గిన అధికారులు ఉన్నప్పటికీ తెలంగాణ తరహా పథకాలు ఎక్కడా? ఎందుకు అమలు కావడంలేదిన ప్రశ్నిం చారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం చట్టాలు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు.