Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతాలు, కులాల పేరిట పనికిమాలిన సంభాషణలు
- ఎనిమిదేండ్లలో తెలంగాణలో గణనీయమైన అభివృద్ధి
- అదే తీరుగా భారతదేశం సాధించి ఉంటే అగ్రగామి దేశాలతో పోటీ పడేవాళ్లం : అమిత్‌షాపై కేటీఆర్ విమర్శలు
- సీఎంఎస్ఈఐ, ఎంఎస్ఎంఈ లబ్దిదారులకు చెక్కులు, వాహనాలు అందజేత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
''చైనా కంటే భారత దేశం ఎందుకు వెనుకబడింది?. 1987లో రెండు దేశాల జీడీపీ ఒకే దగ్గర ప్రారంభమైంది. 36 ఏండ్ల తర్వాత చైనా జీడీపీ 18 ట్రిలియన్ డాలర్లుగా ఉంటే, భారతదేశ జీడీపీ కేవలం 3.4 ట్రిలియన్ డాలర్లు మాత్రమే. అంటే చైనా మనకంటే ఆరు రెట్లు ఎక్కువ జీడీపీని కలిగి ఉంది. అమెరికా, జర్మనీ, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడటమే లక్ష్యంగా చైనా ఎదిగింది. అయితే మన దేశంలో సహజ వృద్ధి తప్ప మరో వృద్ధి జరగలేదు. నేటి పాలకుల దృష్టంతా ఏ మతం గొప్పది? ఏ కులం గొప్పది? అనే వాటిపైనే. ఎనిమిదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షల నుంచి 3.17 లక్షలకు పెరిగి భారతదేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన అవార్డుల్లో తెలంగాణ 30 శాతం అవార్డులు కైవసం చేసుకుంది. ఎనిమిదేండ్లలో తలసరి ఆదాయాన్ని తెలంగాణ 162 శాతం పెంచుకోగలిగితే, అదే రకమైన వృద్ధిని మిగిలిన రాష్ట్రాలు ఎందుకు సాధించలేకపోయాయి.? అలా సాధించి ఉంటే చైనా మాదిరిగానే భారతదేశం కూడా అగ్రదేశాలతో పోటీ పడేది... '' అని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు వ్యాఖ్యానించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లోని బంజారాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సీఎంఎస్ఈఐ, ఎంఎస్ఎంఈ లబ్దిదారులకు చెక్కులను, వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కుల, మతాలు దేవుని సృష్టించినవి కాదనీ, అవి మనిషి కల్పిచుకున్నవేనని తెలిపారు. నీళ్లు, విద్యుత్ పై చర్చించకుండా నా దేవుడు గొప్పా? నీ దేవుడు గొప్పా? అనే చర్చల వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. సమాజం తనకు తాను ఎన్నిరకాలుగా విభజించుకున్నా... కరోనా ఉపద్రవం విశ్వ మానవాళి అంతా ఒక్కటేనని గుర్తుచేసిందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించినా, ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఒక ఆవిష్కరణ అందించలేకపోవడానికి పాలకుల వైఫల్యమే కారణమని విమర్శించారు.
కులాన్ని పెట్టుబడితో కొట్టాలి
కులాన్ని పెట్టుబడితో కొట్టాలని డిక్కీ జాతీయ అధ్యక్షులు చెప్పిన మాటలను తనను బాగా ఆకర్షించాయని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. కుల నిర్మూలన జరిగి అంతరాలు లేని సమాజం రావాలని అంబేద్కర్ ఆశించారనీ, ఆయన ఆశయ సాధన కోసం ముందుగా యువత ఆత్మన్యూనత నుంచి బయటపడాలని సూచించారు. రిస్క్ తీసుకోవద్దు, అప్పు చేయొద్దు. ప్రభుత్వ ఉద్యోగమైతేనే జీవితానికి భద్రత... వంటి చెడగొట్టు సామెతల నుంచి బయటపడాలని సూచించారు. అందరూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. అందుకోసం ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా సహకరిస్తామని తెలిపారు. పడిపోతే తిరిగి లేవాలనీ, ఓటమిని కూడా ఉత్సవంగా జరుపుకునేంత ధైర్యంగా నిలబడాలన్నారు. గిరిజన యువత కూడా ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ హామీలకే పరిమితం ...సత్యవతి రాథోడ్
తండాలను గ్రామపంచాయతీలు చేస్తామంటూ దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీ హామీలిచ్చి మోసం చేసిందని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని అమలు చేసి చూపించిందని తెలిపారు. గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, వాటికి రోడ్లతో అనుసంధానం, గిరిజన సంక్షేమ హాస్టళ్ల భవనాల నిర్మాణం, రెసిడెన్షియల్ విధానంలో డిగ్రీ కళాశాలలు, పెండ్లికి కళ్యాణలక్ష్మి, ఆరోగ్యంగా ఉండేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తదితర పథకాలతో సీఎం కేసీఆర్ గిరిజనులకు జీవిత కాలానికి సరిపడినన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ సమావేశంలో హౌంమంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ట్రైకార్ చైర్మెన్ రామచంద్రు నాయక్, జీఎం శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.