Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పటిష్టమైన కార్యాచరణతోనే అన్ని రంగాల్లోనూ గ్రామాల అభివృద్ధి వేగంగా సాధ్యమవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నొక్కి చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల టీఎస్ఐఆర్డీలో జిల్లా పంచాయతీరాజ్, జిల్లాపరిషన్ సీఈఓలు, డీఆర్డీఓలకు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై రెండు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ...50 శాతం గ్రామాల్లో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలను ఇంకా వినియోగించట్లేదనీ, నీటి సరఫరా, విద్యుత్, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించి సత్వరమే వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. క్రీడా ప్రాంగణాలు నిర్మించి వదలివేయకుండా గ్రామీణ యువత వాడుకునేలా చూడాలన్నారు. తడి, పొడి చెత్త సేకరించి వర్మి కంపోస్టు తయారు చేసి ఆదాయం సమకూర్చుకునేలా జీపీలను ప్రోత్సహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర నిధులతో పంచాయతీలు శాశ్వత ఆదాయం పొందే దిశలో చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని సరైన రీతిలో సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. ఉపాధి హామీ చట్టం పనుల విషయంలో 19 బృందాలు పరిశీలించి పనుల నాణ్యతను ప్రశంసించాయనీ, పనుల్లో చిన్న లోపం కూడా లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కేంద్రం నుంచి రూ.907 కోట్లు మెటీరియల్ కాంపోనెంటు నిధులు రావాల్సి ఉందని చెప్పారు. సీఎస్ శాంతకుమారి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని జీపీల్లోనూ ఖాళీ స్థలాలు గుర్తించి ఆదాయం చేకూర్చేలా వెదురు, టేకు, గంధం, తదితర చెట్ల పెంపకం చేపట్టి సంపద వనాలను సృష్టించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో యువతను భాగస్వాములను చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని నిర్మూలించేలా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలోని 13 పంచాయతీలు కేంద్ర అవార్డులు సాధించడంలో కృషి చేసిన సర్పంచులను, గ్రామ కార్యదర్శులను అభినందించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా మాట్లాడుతూ..నాలుగేండ్లుగా ఉద్యమ స్ఫూర్తితో సిబ్బంది పనిచేయడంతో గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో కమిషనర్ హన్మంతరావు, స్పెషల్ కమిషనర్ ప్రసాద్, డిప్యూటీ కమిషనర్లు, అవార్డులు పొందిన సర్పంచులు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.