Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని జిల్లాల ఎస్పీలు, సిటీ కమిషనర్లకు డీజీపీ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నేరాల దర్యాప్తులో నిందితుల విచారణను క్రైమ్ వర్టికల్స్‌ను కచ్చితంగా పాటించాలనీ, తద్వారానే దర్యాప్తు సంపూర్ణ స్థితికి చేరుకుంటుందని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవారం అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరస్థుల బారి నుంచి ప్రజలను కాపాడటం ఎంత ముఖ్యమో దర్యాప్తును సక్రమంగా నిర్వహించడం ద్వారా నిందితులకు శిక్షను పడేలా చేయడమూ అంతే ముఖ్యమని ఆయన అన్నారు. ఈ ఫలితాలు సాధించాలంటే క్రైమ్ వర్టికల్స్‌లో పేర్కొన్న అంశాలను తూ.చ తప్పకుండా దర్యాప్తు అధికారులు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నేరాల అదుపు, కోర్టుల నుంచి నేరస్థులకు శిక్షలు సాధించడంలో రాష్ట్ర పోలీసు శాఖ మంచి ఫలితాలను సాధిస్తున్నదని ఆయన అన్నారు. అయితే, పోలీసు శాఖలో కొత్తగా చేరిన పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ నేరాలకు సంబంధించిన దర్యాప్తులలో మంచి అవగాహనను, అనుభవాన్ని సాధించడానికి క్రైమ్ వర్టికల్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సీనియర్ పోలీసు అధికారులు వారికి మార్గ నిర్దేశకత్వం చేయడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని చూపరాదని ఆయన అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్ మొదలుకొని సీసీఎస్‌ల వరకు క్రైమ్ వర్టికల్స్‌ను అమలు చేయడంలో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి తాము ఎప్పటికప్పుడు విశ్లేషణలు జరుపుతుంటామని, చక్కటి ఫలితాలను సాధించిన పోలీసు అధికారులకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐడీ అదనపు డీజీ మహేశ్ భగవత్, రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయెల్, రీజియన్ ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, షానావాజ్ ఖాసీం, తదితరులు పాల్గొన్నారు.