Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గణాంకాలపై చర్చకు సిద్ధం
- బీజేపీ నాయకులకు వినోద్ కుమార్ సవాల్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్ర హౌంశాఖ మంత్రి ఆదివారం నాటి చేవెళ్ల సభలో అన్ని అబద్ధాలే చెప్పారని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ నాయకులు చెబుతున్నగణాంకాలు తప్పు అని చర్చించి నిరూపించేందుకు తాను సిద్ధమేనని సవాల్ చేశారు. రాష్ట్రానికి రూ.1.20 లక్షల కోట్లు వివిధ గ్రాంట్ల రూపంలో ఇచ్చినట్టు అమిత్ షా చెప్పారనీ, అందులో నాలుగో వంతు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు సెస్ కింద రాష్ట్రం కేంద్రానికి రూ. 39,189 కోట్లు చెల్లించిందనీ, కేంద్రం మాత్రం రాష్ట్రానికి చెందిన రోడ్లకు రూ. 34 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా రూ. 5 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. అబద్ధాలు చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలి. ఆదాయ లెక్కలకు చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరును సవాల్ చేశారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా జరిగిందా? అని ప్రశ్నించారు. రైతు ఎలా చనిపోయినా రైతుబీమా ఇస్తున్నామనీ, ఆ లెక్కలను తీసుకుని ఆత్మహత్యలుగా బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్, గొట్టిముక్కల వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.