Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకే అమిత్‌షా పర్యటన
- ఆ రిజర్వేషన్లకు వెనుకబాటుతనం తప్ప మతం ఆధారం కాదు :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించడం అన్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆయన ముఠా నాయకుడిగా తెలంగాణకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పకుండా బండి సంజరుని అరెస్టు చేస్తే నిద్రపట్టలేదంటూ ఫ్యాక్షనిస్టులా మాట్లాడారని చెప్పారు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే రాష్ట్రానికి ఆయన వచ్చారని విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ముస్లింలకు రిజర్వేషన్లను సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చారు తప్ప మతం ఆధారంగా కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ పెంచుతామంటూ అమిత్ షా అన్నారని, ఆయనకు నిజంగా హిందువుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం ఎందుకు పెంచడం లేదని అడిగారు. ఎస్టీ రిజర్వేషన్‌ను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ పంపిన తీర్మానాన్ని ఏండ్ల తరబడి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నాన్చుతున్నదని ప్రశ్నించారు. రిజర్వేషన్లకు ఆధారమైన బీసీ జనగణన చేయించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించడం లేదన్నారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు ఉన్న కారణంగానే హిందూ, ముస్లిం పేరుతో ఓట్లలో చీలిక తీసుకొచ్చేందుకు అమిత్‌షా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
హిందువులపైన నిజంగా ప్రేమ ఉంటే, వివేకానంద ఏం చెప్పారో చదవాలని, అలాగే శివాజీ సైన్యంలో ఎంత మంది ముస్లింలు ఉన్నారో తెలుసుకోవాలని బీజేపీ నేతలకు సూచించారు. రాజకీయాల కోసం మతాన్ని ఉపయోగించుకోవడం దుర్మార్గమన్నారు. నోబెల్ బహుమతి గ్రహీత అమర్య్తసేన్పై కేంద్ర ప్రభుత్వం కక్షగట్టిందని విమర్శించారు. పుల్వామా దాడికి భద్రతాలోపాలు, గోవాలో జరిగిన అవినీతిని ప్రస్తావించిన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై సీబీఐ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శించారు. న్యాయవ్యవస్థను కేంద్రం గుప్పెట్లో పెట్టుకుందన్నారు. బీజేపీకి ఇష్టంలేని వారు హిందూ మతానికి చెందిన వారైనా చంపేస్తున్నారని, గాంధీ, గౌరీలంకేశ్, పన్సారే, కల్బుర్గిని హత్య చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. దేశాన్ని పరిరక్షించాల్సిన ప్రధాని మోడీ, హోమంత్రి అమిత్‌షా విచ్ఛిన్నకర శక్తులుగా మారారని విమర్శించారు. కేసీఆర్ కంటే బీజేపీతోనే ఎంఐఎంకు ఎక్కువ సంబంధాలున్నాయని చెప్పారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ, ఎంఐఎం పరస్పర అవగాహనతో పోటీ చేస్తున్నాయని వివరించారు. సమ్మె చేయనున్న ఆర్టిజన్లను పెద్ద నేరస్తులుగా, సంఘ విద్రోహులుగా చిత్రీకరించడం, కనీసం మీడియా సమా వేశాన్ని కూడా నిర్వహించుకునే అవకాశాన్ని ఇవ్వక పోవడాన్ని కూనంనేని ఖండించారు. రూ.లక్ష వరకు రుణ మాఫీ చేయాలని, పోడుభూముల సమస్యను పరిష్కరించా లని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాజకీయ దురుద్ధేశంతోనే అమిత్ వ్యాఖ్యలు : అజీజ్‌పాషా
రాజకీయ దురుద్దేశంతోనే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ అమిత్‌షా వ్యాఖ్యానించారని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా విమర్శించారు. ముస్లింల పరిస్థితి దళితుల కంటే అధ్వాన్నంగా ఉన్నదంటూ పలు కమిటీలు ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయని గుర్తు చేశారు. దేశంలో ఎవరి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా లేకుండా ఆయా వర్గాలకు ఎలా న్యాయం చేస్తారని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పంటనష్టంపై సత్వరమే సర్వే చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ డిమాండ్ చేశారు.
అమిత్‌షా వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించడం ప్రజాస్వామ్యానికి, లౌకిక వ్యవస్థకు వ్యతిరేకమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.
కేంద్రంలో బాధ్యతాయుతంగా ఉండాల్సిన హోంమంత్రి మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడడం దురదృష్టకరమని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దళితులు, గిరిజనుల కంటే ముస్లింలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారంటూ సీపీఐ నేత చండ్రరాజేశ్వర్రావు పరిశీలన చేసి చెప్పారని గుర్తు చేశారు. గతంలో ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఐదు శాతం నుంచి నాలుగు శాతానికి ముస్లిం రిజర్వేషన్లను తగ్గించారని పేర్కొన్నారు. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న అమిత్‌షా మతతత్వాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడ్డాన్ని తీవ్రంగా ఖండించారు.