Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైషమ్యాలు సృష్టించేందుకే ఆ వ్యాఖ్యలు
- వచ్చే నెల 7న రాష్ట్రానికి మాయావతి
- విలేకర్ల సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రిజర్వేషన్ల అంశంపై అమిత్‌షాకు అసలు అవగాహన లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ అమిత్‌షా వ్యాఖ్యానించటం దారుణమన్నారు. రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కేంద్ర హోం మంత్రి స్థాయిలో ఇలాంటి మాటలు మాట్లాడటం శోచనీయమని అన్నారు. వెంటనే అమిత్‌షా తన వ్యాఖ్యానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా, పి ఎస్ కష్ణన్ కమిటీలు ముస్లిం స్థితిగతులపై పరిశోధన జరిపిన అనంతరం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయా రిజర్వేషన్లను మతం పేరిట ఇవ్వలేదని తెలిపారు. వచ్చే నెల 7న రాష్ట్రానికి బీఎస్పీ జాతీయ అధ్యక్షులు కుమారి మాయావతి తెలంగాణకు రానున్నదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఆ రోజు నిర్వహించే భరోసా సభకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు. తొమ్మిదేండ్లుగా చితికిపోయిన తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చేందుకే ఈ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రేవంత్ రెడ్డి, ఈటలకు రాష్ట్రంలో ఇతర సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. 23 వేల మంది ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగులపై ప్రభుత్వం తీవ్ర బలప్రయోగం చేస్తున్నదని విమర్శించారు. గత మూడు రోజులుగా పోలీసులతో అరెస్టు చేయిస్తూ,భయాందోళనలకు గురి చేస్తున్నారని చెప్పారు. ఒప్పంద కార్మికులను ఆర్టిజన్ కార్మికులుగా మార్చి వదిలేశారన్నారు. వారికి కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వీఓఏలు గత కొద్ది రోజులుగా ఆందోళన బాటపట్టారని చెప్పారు. వారికి కేవలం రూ.3,900 గౌరవ వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని తెలిపారు.
అన్ని రకాల పనులు చేస్తున్నా.. కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇందిరా క్రాంతి,జాతీయ ఉపాధి పథకం ఉద్యోగులకు కూడా కనీస వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ లీకేజీ కేసును సీబీఐ కి అప్పగించాలనీ, అసలైన దోషులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్ఎం, కానిస్టేబుల్, జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు ఒకే రోజు ఎలా నిర్వహిస్తారనీ,వాటిని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ వెంకటేష్ చౌహాన్, కార్యదర్శి గుండెల ధర్మెందర్, కోశాధికారి ఎల్లయ్య, అధికార ప్రతినిధి అరుణ క్వీన్, రాష్ట్ర మైనారిటీ కన్వీనర్ అబ్రార్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.