Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన పాత ఫోన్ ఏమైంది?
- బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
'మంత్రి నిరంజన్‌రెడ్డిని నేను సూటిగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. తిమ్మిని బమ్మి చేసే ప్రయత్నం చేశారు. మసిబూసి మారేడు కాయచేస్తున్నారు. మంత్రికి ఎంత మంది దత్త పుత్రులు ఉన్నారో చెప్పాలి. ఆయనపై ఆదాయ పన్నుల శాఖ, ఈడీలకు ఫిర్యాదు చేస్తా' అని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్‌రావు అన్నారు. బీజేపీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇంకా ఎవరినో దత్త పుత్రునిగా చూపించారు కదా? అని ప్రశ్నించారు. గౌడ నాయక్ పేరు మీద వనపర్తి నియోజకవర్గంలో కాంట్రాక్ట్ పనులు చేస్తున్నారని, ఆయన పేరు మీద పొందిన సబ్సిడీలు ఎన్ని? ఏ యే శాఖల నుంచి తీసుకున్నారు? అని ప్రశ్నించారు. దత్తపుత్రునికి కాంట్రాక్టులు, వియ్యంకునికి వీసీ పదవులు దక్కించుకున్నారని గుర్తుచేశారు. వేరుశనగ పరిశోధన కేంద్రం రానేలేదని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి దానికి రూ.40లక్షల కాంట్రాక్ట్‌ను ఇప్పించుకున్నారని చెప్పారు. వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని ఎవరు మంజూరు చేశారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మంత్రి పాత ఫోన్ ఎందుకు మార్చారో? సమాధానం చెప్పాలని అన్నారు. మంత్రిపై ఈడీకి ఫిర్యాదు చేయబోతున్నానని తెలిపారు.
పాత ఫోన్ నెంబర్‌తో మంత్రి చైనాకు చెందిన మో అనే వ్యక్తికి కాల్ చేసేవారని, చైనా వ్యక్తితో వ్యాపార సంబంధాలు ఉన్నాయని వనపర్తి ప్రజలు చెబుతున్నారని గుర్తుచేశారు. గౌడ నాయక్ భూములు ఎలా కొన్నారు? కొన్న డబ్బు ఎక్కడిది? అనే విషయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. సర్వే నెం.60లో 20 ఏకరాలు ఆర్డీఎస్ భూములని రికార్డులు చెబుతున్నాయని, నేను చెప్పడం లేదన్నారు. వ్యవసాయ క్షేత్రం తన భార్య కష్టార్జితమని, రూ.4కోట్లకు ఇస్తా తీసుకుంటావా? అని మంత్రి సవాల్ చేశారని, ఆయన సవాల్ స్వీకరిస్తానని రఘునందన్‌రావు తెలిపారు. తన భార్యతో మాట్లాడి వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. తాను లేవనెత్తిన విషయాలపై చర్చించడానికి వ్యవసాయ క్షేత్రానికి రావడానికి సిద్ధమే? అని అన్నారు.