Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లాన్ బీజేపీది అమలు షర్మిలది : మేడే రాజీవ్‌సాగర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పోలీసులపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల, ఆమె తల్లి విజయమ్మ దాడి చేసి దురుసుగా ప్రవర్తించడాన్ని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్‌సాగర్ తీవ్రంగా ఖండించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చు లేపేందుకు, శాంతి భద్రతల సమస్యలు తీసుకొచ్చేందుకు బీజేపీ కనుసన్నల్లో షర్మిల పనిచేస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీజేపీ ఆడుతున్న నాటకంలో షర్మిల ఓ పావుగా మారారని తెలిపారు. ప్లాన్ బీజేపీది అయితే ఆమె అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. భద్రత కల్పిస్తున్న పోలీసుల మీదే దాడి చేయడం వారి అహంకారానికి నిదర్శనమని తెలిపారు. తల్లి కూతుళ్లు ఒకేరోజు కానిస్టేబుళ్లు, ఎస్ఐ అని చూడకుండా దాడి చేసి పరుషపదజాలంతో తిట్టడం దారుణమని పేర్కొన్నారు. కడపలో చేసినట్టుగా ఇక్కడ రౌడీయిజం చేస్తామంటే కుదరదని హితవు పలికారు.
నలుగురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
తెలంగాణ ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేసి అనివార్య కారణాల వల్ల విధులకు దూరమైన నలుగురు ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామక పత్రాలను ఆ సంస్థ చైర్మెన్ మేడే రాజీవ్ సాగర్ సోమవారం అందజేశారు. మన్నె స్వాతి, శివకుమార్, దివ్య తేజ, పవన్ కుమార్లో ఒక్కరికి శాశ్వత ఉద్యోగం, మిగిలిన ముగ్గురిని క్యాజువల్ ఉద్యోగులుగా నియమించామని తెలిపారు. సంస్థ అభివృద్ధి కోసం పనిచేయాలని సూచించారు. ఇందుకోసం సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్‌కు ధన్యవాదాలు తెలిపారు.