Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1 నుంచి 7 వరకు నిర్వహణ
- రైతు, వ్యకాస, కార్మిక సంఘాల నేతల పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
చారిత్రాత్మకమైన మే డేను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా మే 1 నుంచి 7 వరకు వారోత్సవాలను నిర్వహించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు పిలుపునిచ్చారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 1886లో చికాగో నగరంలో జరిగిన మహత్తరమైన పోరాటంలో అనేకమంది కార్మికులు బలిదానం చేశారని గుర్తు చేశారు. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్నారని అన్నారు. ప్రస్తుతం దేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానంతోపాటు వారి హక్కులను హరిస్తున్నదని అన్నారు. నాలుగు రకాల లేబర్ కోడ్లను తీసుకొచ్చి 29 చట్టాలన్నింటినీ కుదించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రవ్యాప్తంగా కార్మిక వర్గంలోకి విస్తతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రైతుల హక్కులను కాపాడాలి, కనీసం మద్దతు ధర ఇవ్వాలి, నల్లచట్టాల రద్దు చేయాలనే డిమాండ్లపై చారిత్రాత్మక రైతు పోరాటం జరిగిందని గుర్తు చేశారు. తద్వారా ఆ మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి కొట్టినప్పటికీ వాటిని మరో రూపంలో తీసుకొచ్చి కార్పొరేట్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని అన్నారు. పని హక్కు కోసం ఆనాడు వామపక్షాలు యూపీఏ ప్రభుత్వంతో పోరాడి ఉపాధి హామీ గ్యారెంటీ చట్టాన్ని సాధించాయని అన్నారు. దాన్ని కూడా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజల మీద తీవ్రమైన భారాలను కేంద్ర ప్రభుత్వం మోపుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులపాటు సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తూనే రాబోయే కాలంలో కార్మికులు, కర్షకులను కలిపి ఐక్యంగా మహా ఉద్యమాన్ని చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. విలేకర్ల సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జంగారెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ పాల్గొన్నారు.