Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీఎస్సీ లీకేజీ దర్యాప్తు వేగం పెంచండి : రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో పనిచేసే సిబ్బంది పరీక్షలు రాస్తే వాళ్ల బంధువులను ఎందుకు విచారించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం కొన్ని విషయాల్లో ఎందుకుమౌనంగా ఉంటోందని నిలదీసింది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రశ్నాపత్రం లీకేజీ కేసు దర్యాప్తు వేగం పెంచాలని సిట్‌కు తేల్చి చెప్పింది. 45 రోజులవుతున్నా ఇప్పటి వరకు నిందితులు ఎవరో వెల్లడించలేకపోయిందని ఆక్షేపించింది. ఇప్పటికీ నిందితుల వాంగ్మూలం నమోదు చేయడం తప్ప ఏమీ చేసినట్టుగా లేదని వ్యాఖ్యానించింది. ఎలాంటి ఫలితాన్ని రాబట్టకపోయిందని తప్పుపట్టింది. ప్రశ్నాపత్రం లీక్ కేసుపై ప్రస్తుత సిట్ విచారణ కొనసాగిస్తుందా లేక సీబీఐ లేదా ఇతర స్వతంత్ర దర్యాప్తు సంస్థకు విచారణ అప్పగించాలా అనే అంశాలపై ఈనెల 28న జరిగే విచారణలో తేల్చుతామని హైకోర్టు వెల్లడించింది. సిట్‌కు ఏదైనా మార్గదర్శకాలు ఇవ్వాలా?.. సీనియర్ ఐపీఎస్‌ను సిట్‌లో చేర్చాలా.? అనేది తదుపరి విచారణ తేదీన నిర్ణయిస్తామని స్పష్టం చేసింది. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరై ఉత్తీర్ణులైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రుల మనోవేదన, బాధలను అర్ధం చేసుకోవాలని వ్యాఖ్యా నించింది. పేపర్ లీకేజీ తర్వాత పరీక్షల వాయిదా, కొన్నింటిని రద్దు చేయడాన్ని హైకోర్టు సమర్థించింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేస్తూ జస్టిస్ బిజరుసేన్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు పేపర్ లీకేజీ కేసును సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయలేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌గౌడ్ సహా ముగ్గురు వేసిన పిటిషన్ తరఫున సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా వాదనలు వినిపించారు.