Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీహెచ్ డాక్టర్ జి.శ్రీనివాసరావు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మలేరియా కేసులను గణనీయంగా తగ్గించినందుకుగాను 2022 సంవత్సరానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బెస్ట్ పర్ఫార్మెన్స్ స్టేట్ అవార్డును తెలంగాణకు ప్రదానం చేసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి. శ్రీనివాసరావు తెలిపారు. ఏప్రిల్ 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని (ఏప్రిల్ 25) ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2014లో 5,222 మలేరియా కేసులు నమోదు కాగా 2022 నాటికి వాటి సంఖ్య 611కు తగ్గిందని తెలిపారు. ఆ ఏడాది దేశంలో 1.73 లక్షల కేసులు రాగా అందులో 0.35 శాతం మాత్రమే రాష్ట్రంలో నమోదు కావటం గమనార్హం. రాష్ట్రంలో కొత్తగూడెం, ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదు కాగా, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి- భువనగిరి జిల్లాల్లో సున్నా కేసులు నమోదయ్యాయి. 15 జిల్లాల్లో 10 లోపు కేసులు మాత్రమే నమోదయ్యాయి.