Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షేత్రస్థాయి విద్యుత్ సంస్థల అధికారులకు ఆదేశాలు
- ఆర్టిజన్ కార్మికుల ఆందోళనపై సర్కారు ఉక్కుపాదం
- నేటి ఉదయం 8 గంటల నుంచి సమ్మెలోకే...
- స్పష్టం చేసిన హెచ్-52 నేతలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
విద్యుత్ సంస్థల్లో పనిచేసే ఆర్టిజన్ కార్మికులు ఎవరైనా సమ్మెలో పాల్గొంటే తక్షణం వారిని అక్కడికక్కడే ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేయాలని టీఎస్జెన్కో, ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎమ్డీలు దేవులపల్లి ప్రభాకరరావు, జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు ఉత్తర్వులు జారీ చేశారు. తీవ్రమైన అనారోగ్య కారణాలు ఉంటే తప్ప, ఎవరికీ సెలవులు కూడా ఇవ్వొద్దనీ, తప్పనిసరిగా అందరూ విధులకు హాజరుకావల్సిందేనని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏప్రిల్ 15వ తేదీనే వేతన ఒప్పందం కుదిరినందున ఆర్టిజన్ కార్మికులు ఎవరూ సమ్మెలోకి వెళ్లొద్దని వారు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు అయితే తాము శాంతియుతంగా నిరసనలు తెలుపుతామని హెచ్-52 సంఘం ప్రధాన కార్యదర్శి సాయిలు ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 8 గంటల నుంచే తాము నిరసనల్లో పాల్గొంటామన్నారు. ఆర్టిజన్లను రెచ్చగొట్టే చర్యల్ని యాజమాన్యం ఉపసంహరించుకోవాలని కోరారు. తక్షణం తమ సమస్యల్ని పరిష్కరించేలా చర్చలు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు.