Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో ఉన్న మూడు సీట్లు కూడా రానీయం
- రైతాంగ పోరాట స్ఫూర్తితో బీజేపీని నిలువరిస్తాం: విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
బీజేపీ దేశంలో రాష్ట్రంలో విభజన రాజకీయాలు చేస్తుందని, తెలంగాణలో ఉన్న మూడు సీట్లు కూడా ఈసారి ఆ పార్టీకి రానివ్వమని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. రైతాంగ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డమీద బీజేపీని అడుగుపెట్టనివ్వబోమని చెప్పారు. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో 'మన ఉత్పత్తులు మన గౌరవం' కార్యక్రమంలో భాగంగా ఉత్పత్తుల కేంద్రం స్టాల్స్‌ను ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మన ఉత్పత్తులను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు, వారిని ప్రోత్సహించేందుకే సుమారు రూ.20 లక్షలతో మన ఉత్పత్తుల కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని, మతతత్వ రాజకీయాల బీజేపీకి రాష్ట్రంలో చోటు లేదని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని అమిత్ షా చేసిన ప్రకటనపై మంత్రి స్పందిస్తూ.. ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతుందని విమర్శించారు. కార్పొరేట్, పెట్టుబడుదాలకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. మోడీ, అమిత్ షా ఇద్దరూ దేశంలో ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. దేశాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలోని మేధావులు, కవులు, కళాకారులందరూ విభజన రాజకీయాలపై ఆలోచించి, వాటిని తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కెేసీిఆర్ వైపు చూస్తూ తెలంగాణ భవన్‌కు వస్తున్నారన్నారు. దేశంలో 30 శాతం మంది ప్రజలు మూడు పూటల తిండికి నోచుకోవడం లేదన్నారు. దీనికి బీజేపీ నాయకత్వం సిగ్గుపడాలన్నారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డీఆర్డీఏ పీడీ ఉపేందర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి అనురాధ, ఉద్యోగుల శాఖ జిల్లా అధికారి అన్నపూర్ణ, మెప్మా పీడి రమేష్ బాబు పాల్గొన్నారు.