Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ-ముదిగొండ
గ్రామదీపికల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న గ్రామదీపికల నిరవధిక సమ్మెలో సోమవారం ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ దీపికలతో వెట్టిచాకిరి చేయిస్తుందన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా గ్రామదీపికులకు నెలకు రూ.27 వేల గౌరవవేతనం ఇచ్చి గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే భవిష్యత్తు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందిరాక్రాంతి పథకంలో పనిచేస్తున్న వారిలో గ్రామదీపికలను విడగొట్టే ప్రయత్నాలను కొద్ది మంది చేస్తున్నారని, అటువంటి వారి ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు రమ్య, మండల కన్వీనర్ టీఎస్ కళ్యాణ్, గ్రామదీపికల సంఘం మండల కన్వీనర్ దమ్మాలపాటి శారద, సీపీఐ(ఎం) నాయకులు మందరపు వెంకన్న, వేల్పుల భద్రయ్య, ఇరుకు నాగేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.