Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- విలేకరులు
తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వీఓఏలు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కడ్తాల్, తలకొండపల్లి, కందుకూర్, మహేశ్వరంతోపాటు మరికొన్ని మండలాల్లో వీఓఏలు దీక్షలు చేపట్టారు. మహేశ్వరంలో చేపట్టిన దీక్షకు సీఐటీయూ కందుకూర్ మండల కన్వీనర్ బుట్టి బాలరాజ్, సీఐటీయూ నాయకులు మద్దతు తెలిపారు. ఒంటి కాలిపై నిలబడి వీఓఏలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. వీఓఏల సమ్మెపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. వెంటనే స్పందించి వీఓఏల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కడ్తాల్లో చేపట్టిన దీక్షకు జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి మద్దతు తెలిపారు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఐకేపీ వీఓఏల సమ్మెకు సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ మద్దతు తెలిపారు. చండూర్లో సమ్మెకు కేవీపీఎస్ మండల కమిటీ తరపున సంఘీభావం తెలిపారు.
మర్రిగూడలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య సమ్మెలో పాల్గొన్నారు. చిట్యాలటౌన్లో చిట్యాల మండల కేంద్రంలో వీవోఏలు మోకాళ్ల మీద నిలబడి, బతుకమ్మ ఆటపాటలతో ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నారబోయిన శ్రీనివాస్ సమ్మె శిబిరాన్ని సందర్శించారు. దేవరకొండలో వీఓఏల సమ్మెలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో వీఓఏల సమ్మెకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ సంఘీభావం తెలిపారు.