Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక యువతకు 80 శాతంపైనే ప్రాధాన్యత ఇవ్వాలి
- విద్యుత్ వాహనాల వినియోగదారులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత
- పర్యావరణ మార్పులో భాగంగానే విద్యుత్ వాహనాల ఉత్పత్తికి పెద్దపీట : ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్
- మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ శంకుస్థాపనలో మంత్రి
నవతెలంగాణ జహీరాబాద్
రానున్న రోజుల్లో రాష్ట్రం విద్యుత్ వాహనాల తయారీ హబ్‌గా మారనుందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమలో విద్యుత్ వాహనాల తయారీ యూనిట్‌ను పరిశ్రమ సీఈవో సుమన్ మిశ్రా, మహేంద్ర యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములుతో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్య నియంత్రణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో రాష్ట్రంలో విద్యుత్ వాహనాల తయారీ పరిశ్రమలకు, వాహనాల వినియోగదారులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలోని జహీరాబాద్, మహబూబ్‌నగర్, వికారాబాద్‌లో విద్యుత్ ఉత్పాదక కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే మహేంద్ర అండ్ మహేంద్ర పరిశ్రమకు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. పరిశ్రమ యాజమాన్యం, ప్రభుత్వం, కార్మికులు పరస్పర అవగాహన కలిగి ఉంటే ఆ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు, మహేంద్ర కార్మిక యూనియన్ అధ్యక్షులు చుక్క రాములు చెప్పిన మాటలను ఏకభవిస్తున్నానని మంత్రి చెప్పారు. తెలంగాణలో తొమ్మిందేండ్ల పాలనలో ఏ పరిశ్రమ కూడా లాక్డౌన్ కాలేదని, కార్మికులు సమ్మెకు దిగలేదన్నారు. సమస్య వస్తే ప్రభుత్వం యాజమాన్యాన్ని ఒప్పించి కార్మికుల పక్షాన ప్రభుత్వం నిలబడుతూ కార్మికుల హక్కులను కాపాడుతుందని తెలిపారు. ఉత్పత్తులను పెంచి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసినా స్థానిక యువతకు 80 శాతానికిపైనే ప్రాధాన్యత ఇచ్చి ఉపాధి కల్పించాలని పరిశ్రమల నిర్వాహకులు, పెట్టుబడిదారులతో ఒప్పందం చేసుకుంటున్నామని, మహేంద్ర కంపెనీ కూడా దాన్ని అమలు చేయాలని సీఈవో సుమన్ మిషన్‌కు విజ్ఞప్తి చేశారు. మహీంద్రా అండ్ మహేంద్రా పరిశ్రమలో ఉపాధి కోసం స్థానిక యువతకు ప్రభుత్వపరంగా నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు ముందుకువస్తున్న పెట్టుబడిదారులకు టీఎస్ఐ పాస్ విధానం ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని, లేనిపక్షంలో 16వ రోజు నుంచి ఆటోమేటిక్‌గా ఆ పరిశ్రమ ఏర్పాటుకు అన్ని అనుమతులు లభిస్తాయని తెలిపారు. అలా ఈ తొమ్మిదేండ్లలో 23 వేల పైచిలుకు పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇచ్చామని, దాంతో రూ.3.30 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. ఈ పరిశ్రమల ద్వారా 20 లక్షలపైన తెలంగాణ యువతకు ఉపాధి లభించిందని తెలిపారు.
ప్రతిభ ఉన్న పరిశ్రమలు యూనివర్సిటీలు, విద్యాసంస్థల నుంచి ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు. దీనికోసం డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం టీఎస్ ఐపాస్‌ను ఏర్పాటు చేశామన్నారు. దాంతో గ్రామీణ విద్యార్థులు మల్టీనేషన్ కంపెనీలో ఉద్యోగాలను పొందుతున్నారని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బైక్‌లు, ఆటోలు, కార్లు ఇక్కడే ఉత్పత్తి అయి ఎగుమతి కావాలని ఆకాంక్షించారు. అందుచేతనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. మహేంద్ర అండ్ మహేంద్రలో ఉత్పత్తి అయిన వాహనాలను మున్సిపాలిటీల్లో, ఆర్టీసీలో, మెట్రో స్టేషన్ల వినియోగానికి అనుమతులు ఇస్తామని తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఫార్ములా ఈ రేస్‌కు కూడా హైదరాబాద్‌ను ఎన్నుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్ రావు, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రెటరీ, జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ విష్ణువర్ధన్ రెడ్డి, మహేంద్ర స్థానిక పరిశ్రమ అధికారులు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.మల్లేశం, తహసీల్దార్ స్వామి, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, యూనియన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.