Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనుధర్మ శాస్త్రాన్ని పాఠ్యపుస్తకాల్లో చేర్చుతున్నారు
- విద్యకు దూరమవుతున్న బాలికలు
- అక్టోబర్ 5న ఢిల్లీలో భారీ ప్రదర్శన: ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి
నవతెలంగాణ - యాదగిరిగుట్ట
మహిళల హక్కులను కాలరాసే మనుధర్మ శాస్త్రాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాఠ్య పుస్తకాల్లో చేర్చుతోందని ఐద్వా జాతీయ కోశాధికారి ఎస్.పుణ్యవతి అన్నారు. ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు రెండ్రోజులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో నిర్వహిస్తున్నారు. మొదటి రోజు సోమవారం ప్రారంభ సమావేశంలో పుణ్యవతి మాట్లాడుతూ.. నూతన విద్యా విధానం పేరుతో ప్రభుత్వ బడులను మూసేస్తుండటంతో బాలికలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశ విదేశాల్లో మహిళలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు లేక సతమతమవుతుండగా.. ఇంకోవైపు మతోన్మాద శక్తులు మహిళల హక్కులను నీరుగార్చుతు న్నాయన్నారు.
దేశంలో ప్రస్తుతం కార్పొరేట్ మతోన్మాద శక్తుల కలయికతో ప్రజల జీవితాలు అతలాకుతల మవుతున్నాయని చెప్పారు. అదానీ, అంబానీలు ప్రపంచ కుబేరులు అవుతుండగా.. పేద ప్రజల జీవి తాలు మరింత దుర్భరమవుతున్నాయని చెప్పారు. మహిళలు అతి తక్కువ వేతనాలతో పని చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు, లైంగికదాడులు, హింస పెరిగిందన్నారు. మోడీ వ్యతిరేక ప్రచార క్యాంపెనింగ్ను ఐద్వా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చేపడుతుందని చెప్పారు. ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ మహిళలను పెద్దఎత్తున సమీకరించి అక్టోబర్ 5న ఢిల్లీలో పెద్ద ప్రదర్శన చేపట్టనున్నట్టు చెప్పారు.
ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మహిళా వ్యతిరేక విధానాలపై మహిళలను చైతన్యవంతం చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణజ్యోతి, నాయకులు ఎం.భారతి, పి.ప్రభావతి, కెఎన్.ఆశాలత, బి.అనురాధ, రామేశ్వరి, టి.జ్యోతి, బి.సరళ తదితరులు పాల్గొన్నారు.