Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ బిల్లులపై తమిళిసై నిర్ణయం
- వీలైనంత త్వరగా అమోదించాలి
- లేకపోతే నిర్ణీత కాలంలో తిరిగి పంపాలి : సుప్రీంకోర్టు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్, న్యూఢిల్లీ
రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఒక బిల్లును తిరస్కరించి.. మిగిలిన రెండు బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరారు. డీఎంఈ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) సహా వైద్యవిద్యలో పాలనాపరమైన పోస్టుల పదవీ విరమణ వయస్సు పెంపునకు ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును తమిళిసై తిరస్కరించారు. పురపాలికల్లో అవిశ్వాస తీర్మానం గడువును మూడు నుంచి నాలుగేండ్లకు పొడిగింపు, కో-ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపునకు ఉద్దేశించిన పురపాలిక చట్టసవరణ బిల్లు, కొత్తగా మరికొన్ని ప్రయివేటు విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తూ తీసుకొచ్చిన చట్టసవరణ బిల్లులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె వివరణ కోరారు. గతంలోనే మూడు బిల్లులకు ఆమోదం తెలిపిన గవర్నర్..రెండింటిని రాష్ట్రపతి సమ్మతి కోసం పంపారు. తాజాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో రాజ్‌భవన్‌లో ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేనట్టయింది.
మరోవైపు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను క్లియర్ చేసేందుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ఆదేశించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన ధర్మాసనం శనివారం విచారించింది. గవర్నర్ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. గవర్నర్ వద్ద ఏ బిల్లులు పెండింగ్‌లో లేవంటూ తెలిపారు. కొన్ని బిల్లులను మాత్రం ఆమె తిప్పి పంపారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ.. ఎన్నికైన ప్రభుత్వం గవర్నర్ దయకోసం చూడాల్సి వస్తోందన్నారు. 'మధ్యప్రదేశ్‌లో ఒక వారంలో, గుజరాత్లో ఒక నెలలో బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. తెలంగాణ ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి ఇది జరుగుతోంది' అని పేర్కొన్నారు. 2022 సెప్టెంబర్ నుంచి మూడు బిల్లులను గవర్నర్ పెండింగ్‌లో ఉంచారనే విషయాన్ని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో దవే, మెహతా మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కోర్టులో అరవొద్దనీ, దానివల్ల ఏం సాధించలేరంటూ దవేని ఉద్దేశించి మెహతా అన్నారు. దీనికి దవే స్పందిస్తూ ''ఆయన అంత నీచ స్థాయికి దిగజారిపోయాడు. ఆయన అరుస్తూ అన్నాడు. నేనూ అరిచానా? ఇతను దేశానికి లా ఆఫీసర్. కేంద్ర ప్రభుత్వం నియమించిన న్యాయాధికారి. కనిపించిన ప్రతిసారీ, అతనికి నామీద ఎలర్జీ ఉంటుంది. నాకు మీ మీద అలెర్జీ ఉంది. అతను చాలా దిగజారిపోయాడు'' అని పేర్కొన్నారు. ఈ తరుణంలో ధర్మాసనం ఈ విషయంపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లోని మొదటి నిబంధనను అమలు చేయడానికి బిల్లులను ''సాధ్యమైనంత త్వరగా'' వాపసు చేయాలని పేర్కొంది. బిల్లులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలనీ, లేకపోతే నిర్ణీత సమయంలో తిరిగి పంపాలని సూచించింది. బిల్లులను ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించింది. ఆర్టికల్ 200 మొదటి నిబంధన ప్రకారం, బిల్లును సమర్పించిన తరువాత గవర్నర్ 'సాధ్యమైనంత త్వరగా' నిర్ణయం తీసుకోవాలి. సమ్మతి కోసం, ద్రవ్య బిల్లు కాని బిల్లును రాష్ట్ర శాసనసభకు పునరాలోచన సందేశంతో తిరిగి పంపండి. ''సాధ్యమైనంత త్వరగా'' అనే ముఖ్యమైన రాజ్యాంగ ఉద్దేశం ఉంది. దానిని గుర్తుంచుకోవాలి'' అని పేర్కొంది. ధర్మాసనం పరిశీలనపై ఎస్జీ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. అది అవసరం లేదని పేర్కొన్నారు. దీనికి సీజేఐ స్పందిస్తూ 'మేం ఈ గవర్నర్ కోసం ఈ పరిశీలన చేయలేదు. దీన్ని గుర్తుంచుకోవాలని మేము చెప్పాం' అని అన్నారు. ప్రస్తుతం బిల్లులు పెండింగ్‌లో లేనందున ఈ కేసును ముగిస్తున్నామని న్యాయస్థానం తెలిపింది.