Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 నెలల్లో నిర్వహించాలంటూ హైకోర్టు ఉత్తర్వులు
నవతెలంగాణ - హైదరాబాద్
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగల్ ఇచ్చింది. మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర్ర ప్రభుత్వానికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేండ్లకు ఒకసారి ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయని, వెంటనే ఆ ప్రక్రియ చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నేత కె రాజిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎస్ నందా సోమవారం విచారించారు. 2016లో ఎన్నికలు జరిగాయని, 2018లో ఆ సంఘం కాల పరిమితి ముగిసిందని వివరించారు. రెండేండ్లకోసారి ఎన్నికలు జరగాలన్న నిబంధనను అమలు చేయడం లేదంటూ పిటిషనర్ వాదించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పిటిషనర్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతోపాటు పలువురిని పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలంటూ పలుమార్లు కార్మిక శాఖ కమిషనర్‌ను స్వయంగా కోరినా ఫలితం లేదన్నారు. ట్రేడ్ యూనియన్లను నీరుగార్చేలా ప్రభుత్వ విధానం ఉందని తెలిపారు. సంఘ వ్యవహారాన్ని నిరుత్సాహపరిచేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వివరించారు. ఎన్నికలు నిర్వహించకపోవడం చట్టవిరుద్ధమని చెప్పారు. వెంటనే టీఎస్ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పిటిషనర్ తరఫున న్యాయ వాది ఏకే జయప్రకాశ్‌రావు వాదించారు. వాదనల అనంతరం మూణ్నెళ్లలోగా ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయమూర్తి నందా ఉత్తర్వులు జారీ చేశారు.