Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 లక్షల మంది నిరుద్యోగులతో కేసీఆర్ చెలగాటం
- మే మొదటివారంలో నిరుద్యోగ నిరసన సభకు ప్రియాంక గాంధీ
- జిల్లాల వారీగా నిరుద్యోగ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలి : ఖమ్మం నిరుద్యోగ నిరసన ర్యాలీలో రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి/ ఖమ్మం
రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారని.. కానీ ఈ తొమ్మిదేండ్లలో ఊరుకో ఉద్యోగమైనా ఇచ్చారా అని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న కేసీఆర్ ఏ మేరకు నియామకాలు చేపట్టారని ప్రశ్నించారు. ఖమ్మంలో సోమవారం నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. స్థానిక ఇల్లెందు క్రాస్‌రోడ్డు నుంచి ర్యాలీ ప్రారంభించి మూడు కి.మీ మేర పాదయాత్ర చేస్తూ వైరారోడ్డు, జడ్పీ సెంటర్ మీదుగా పాతబస్టాండ్ సెంటర్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ ఆలోచన ఖమ్మం జిల్లాలోనే పుట్టిందన్నారు. రాష్ట్రం వచ్చి తొమ్మిదేండ్లయినా ఉద్యోగాలు రాలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవ్వలేదన్నారు. ఉద్యమకారులపై కేసులు తొలగించలేదని, అమరవీరుల కుటుంబాలను రాష్ట్రప్రభుత్వం ఆదుకోలేదని తెలిపారు. తెలంగాణ తొలి శాసనసభలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని సీఎం కేసీఆర్ ప్రకటించారని, తొమ్మిదేండ్ల తర్వాత నేడు బిశ్వాస్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని తేలిందన్నారు. దీన్నిబట్టి ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప కొత్త నియామకాలు జరగేలేదని అర్థమవుతుందన్నారు. కాంగ్రెస్ పోరాటాలతో దిగివచ్చిన కేసీఆర్.. 80వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించారని, దాంతో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగులు ఆశపడ్డారని తెలిపారు. కానీ ఎంతకూ నోటిఫికేషన్ రాక ఖమ్మం జిల్లాలోనే ముత్యాల సాగర్ అనే పీజీ యువకుడు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో నమోదు చేసుకుంటే.. ప్రశ్నాపత్రాలు అమ్ముకుని, దొంగిలించినోన్ని పట్టుకోకుండా.. దాన్ని వెలికి తీసిన తనపై కేసులు పెట్టిస్తావా అని నిలదీశారు. తెలంగాణ నిరుద్యోగుల తరఫున పోరాడేందుకు ప్రియాంక గాంధీ మే మొదటివారంలో సరూర్‌నగర్‌లో నిరసనకు హాజరవుతారని తెలిపారు. 2014, 2018లో ఒక్కో స్థానం బీఆర్ఎస్ గెలుచుకున్నా...ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు చేజిక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఖమ్మం పోరాటాలకు మారుపేరన్నారు. టీఎస్పీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చి పేపర్‌లీకేజీకి ప్రభుత్వం కారణమైందన్నారు. జిల్లాల వారీగా నిర్వహించే నిరుద్యోగ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌదరి మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో అనేక ఖాళీలున్నా భర్తీ చేయడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం పోటీ చేసే అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మాటపైన జీఎస్టీ లేదు కాబట్టి ఏదైనా మాట్లాడొచ్చనే రీతిలో కేసీఆర్, కేటీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు మాట్లాడుతూ.. తాను బీసీనంటూ బీసీలపై మోడీ కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారన్నారు. అంత ప్రేముంటే క్రీమిలేయర్ ఎందుకు ఎత్తివేయడం లేదని ప్రశ్నించారు. అమిత్‌షా తాము అధికారంలోకి వస్తే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ ఎత్తివేస్తామనడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ర్యాలీలో భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్య, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, సంభాని చంద్రశేఖర్, మాజీ కేంద్రమంత్రి బలరాంనాయక్, మాజీ ఎంపీ మల్లు రవి, గడ్డం ప్రసాద్, శివసేనారెడ్డి, బల్మూరు వెంకట్, అనిల్‌కుమార్ యాదవ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాసరెడ్డి, జావీద్, మిక్కిలినేని నరేందర్, ముస్తఫా, కొప్పెర ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.