Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఆర్టీ సెంటర్లలో 14 మంది రాజీనామా
- ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్న వైనం
- పీఎల్ హెచ్ఐవీ రోగులకు తీరని కష్టాలు
- కొత్త ఏపీడీ వచ్చినా... మారని శాక్స్ పనితీరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నిర్లక్ష్యపు నీడ తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలిని వీడడం లేదు. అధికారులు మారితే పనితీరులో మార్పు వస్తుందని ఆశించినా అలాంటిదేమి కనిపించడం లేదు. కొత్త అధికారులు వచ్చినా అదే ధోరణి కొనసాగుతుండటంతో హెచ్ఐవీ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంటూ నిత్యం మందులు వాడుతూ డాక్టర్ల సలహాలను తీసుకుంటూ ఆయుష్షును పెంచుకుంటున్న వారికి తగిన తోడ్పాటునందించాల్సి ఉంటుంది. మిగిలిన రోగులకు భిన్నంగా వారు ప్రత్యేక మందులు, అవసరాలు కలిగిన నేపథ్యంలో ఆ వ్యాధి వ్యాప్తిని నిరోధించడంతో పాటు రోగులకు తగిన రీతిలో సేవలందించేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ - నాకో) ఏర్పాటైన సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి నాకో పరిధిలో పని చేస్తున్నది.
హెచ్ఐవీతో నివసిస్తున్న వారిని పాజిటివ్ లివింగ్ విత్ హెచ్ఐవీ (పీఎల్ హెచ్ఐవీ)గా పిలుస్తుంటారు. రాష్ట్ర నియంత్రణ మండలి వద్ద ఇలాంటి వారు దాదాపు 1.50 లక్షల మందికిపైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో కొద్ది (శాతం) మంది ఇప్పటికే మరణించగా, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 80 నుంచి 90 వేల మంది వరకు రెగ్యులర్‌గా ఏఆర్టీ సెంటర్ల నుంచి వైద్యసేవలను అందుకుంటున్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తంగా 22 ఏఆర్టీ సెంటర్లను ఏర్పాటు చేశారు. రోగుల రద్దీని బట్టి పెద్ద సెంటర్లలో ఇద్దరి నుంచి ముగ్గురు వరకు డాక్టర్లుంటారు. 500 పీఎల్హెచ్ఐవీ రోగులకు ఒక డాక్టరు అందుబాటులో ఉండాలని నాకో నిబంధనలు చెబు తున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ల నోటిఫికేషన్ విడుదల చేయడం, వాటిలో రెగ్యులర్ పోస్టులొచ్చిన 14 మంది (నాకో పరిధిలో కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేసే వైద్యులు) ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ పోస్టులకు రాజీనామా చేయడంతో ఖాళీలేర్పడ్డాయి. వీటిని వెంటనే భర్తీ చేయాల్సి ఉంది. గతంలోనూ అలాంటి సంప్రదాయమే కొనసాగింది.
ఏఆర్టీ సెంటర్లకు ప్రతి నెలా మందుల కోసం రోగులు వస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఇతరత్రా ఇబ్బందులెదురైతే డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరికి నిరంతరాయంగా డాక్టర్లను అందు బాటులో ఉంచాల్సి ఉంటుంది. అయితే గత ఫిబ్రవరి నుంచి పలు ఏఆర్టీ సెంటర్లకు చెందిన 14 డాక్టర్ పోస్టులు ఖాళీ అయినా వాటిని భర్తీ చేయకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్నెల్లకు ఒకసారి వైరల్ లోడ్ తదితర పరీక్షలను నిర్వహించి వ్యాధి తీవ్రతను బట్టి మెడికేషన్ ఇస్తుంటారు. అయితే ఒక్కసారిగా నెలల తరబడి డాక్టర్లు అందుబాటులోకి రాకపోవడంతో ఎవరిని సంప్రదిం చాలో అర్థం కావడం లేదని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్‌ను కొత్తగా వచ్చిన అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ మురళీధర్, ఇన్‌ఛార్జి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్వేతా మహంతి దృష్టికే తీసుకెళ్లకపోవడం, పూర్తి స్థాయిలో ప్రాజెక్టు డైరెక్టర్ లేకపోవడం కూడా డాక్టర్ల పోస్టుల భర్తీకి, ఇతర పనుల్లో వేగం తగ్గడానికి కారణంగా తెలుస్తున్నది. ఇప్పటికైనా వైద్యారోగ్యశాఖ మంత్రి జోక్యం చేసుకుని పోస్టుల భర్తీకి ఆదేశించాలని రోగులు కోరుతున్నారు.