Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి బతుకులు దుర్భరం
- చట్టాల అమలు కోసం పోరాటం : సీడబ్ల్యూఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వలస కార్మికులు ఎవ్వరికీ పట్టనోళ్లుగా మారారనీ, వారి బతుకులు దుర్భరంగా ఉన్నాయని సీడబ్ల్యూఎఫ్ఐ అఖిల భారత ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు అన్నారు. వలస కార్మికుల చట్టాలనూ పాలకులు, యజమానులు బుట్టదాఖలు చేస్తున్నారని విమర్శించారు. ఆ చట్టాలను పకడ్బంధీగా అమలు చేసేందుకు సీఐటీయూ పోరాడుతున్నదని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భవన నిర్మాణ రంగ వలస కార్మికుల రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.సాయిబాబు మాట్లాడుతూ...వలస కార్మికులు రోజుకు 14 నుంచి 16 గంటలు పనిచేస్తున్నారనీ, వారికి ఎక్కడ కూడా కనీస వేతనాలు అమలు కావడం లేదని చెప్పారు. వారికి సామాజిక భద్రత కరువైందన్నారు. అటు సొంత ప్రాంతంలోనూ, ఇటు పని ప్రదేశంలోనూ ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు లేక వారు అవస్థలు పడుతున్న తీరును వివరించారు. ప్రతి పౌరునికీ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుందని ఆర్టికల్ 19(1) చెబుతుంటే...వలస కార్మికులు మాత్రం పనిప్రదేశాల్లో తీవ్ర వివక్షకు, అణచివేతకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కో రూమ్‌లో ఏడెనిమిది మంది వలస కార్మికులను యాజమాన్యాలు, దళారులు కుక్కి ఉంచుతున్న దైన్యస్థితిని వివరించారు. 1979 అంతర్ రాష్ట్ర వలస కార్మికుల చట్టం ప్రకారం వలస కార్మికుల పేర్లను రిజిష్టర్‌లో నమోదు చేయాలనీ, వారికి పునరావాసం, సమాన పనికి సమాన వేతనం, పిల్లలకు విద్యా,వైద్య సౌకర్యాలు, రానుపోను ప్రయాణ చార్జీలు, తదితర సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అయితే, ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదని వాపో యారు. ఇప్పటివరకు అమలులో ఉన్న అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని అక్యుపేషనల్ సేప్టీ హెల్త్, వర్క్ కండిషన్ కోడ్‌లోకి మార్చిందన్నారు. దీంతో ఆ చట్టం రద్దయిపోయిం దని తెలిపారు. ఈ చట్టం రద్దుతో వలస కార్మికులు తమ హక్కులను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం వలస కార్మికుల పేర్లను కార్మిక శాఖ నమోదు చేయాలనీ, రిజిస్ట్రర్లను తప్పనిసరిగా మెయింటెన్ చేయాలని డిమాండ్ చేశారు. వారికి రేషన్, గుర్తింపు కార్డులను ఇవ్వాలని కోరారు. వలస కార్మికులకు కూడా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని కోరారు. వలస కార్మికులు పని ప్రదేశాల్లో వారు వేధింపులకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత కార్మిక శాఖపై ఉందని నొక్కిచెప్పారు. వలస కార్మికులు నివాసం ఉండే ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తనిఖీ చేయాలని కోరారు. వలస కార్మికులను సమీకరించి హక్కుల కోసం పోరాడేలా భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఫెడరేషన్ ముందువరుసలో ఉండాలని సూచించారు. వలస కార్మికులకు అండగా ఉండేదీ, వారిలో ధైర్యాన్ని నింపేదీ ఎర్రజెండానేనని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల ఫెడరేషన్ గౌరవాధ్యక్షులు వంగూరు రాములు, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.రామ్మోహన్ రావు, రత్నాకరం కోటంరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ ముదాం శ్రీనివాసరావు, రాష్ట్రనాయకులు లక్ష్మినారాయణ, తదితరులు పాల్గొన్నారు.