Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్ నాయకత్వం అనివార్యం
- బ్రెయిన్ లేని బంటి.. పార్టీలు మారే సంటీ ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు : కేటీఆర్
నవతెలంగాణ - సిరిసిల్ల/విలేకరులు
బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశం సర్వనాశనం అయిందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధికి చిరునామాగా చేసిన కేసీఆర్ నాయకత్వం దేశానికి అనివార్యమైందని స్పష్టం చేశారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభలు నిర్వహించారు. అందులో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభ సిరిసిల్ల పురపాలక పరిధి అపెరల్ పార్కు వద్ద నిర్వహించారు. మంత్రి పార్టీ జెండా ఆవిష్కరించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం సాధించాక రెండుసార్లు ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టారని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవాలంటే కేసీఆర్ లాంటి దమ్మున్న నాయకుడు కావాలన్నారు. మహారాష్ట్రలో కేసీఆర్ బహిరంగ సభలు పెడితే రైతులు, ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న రోజుల్లో ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతం అవుతుందన్నారు. 2010 నుంచి 2014 వరకు గుజరాత్ రాష్ట్రంలో జరగని అభివృద్ధిని జరిగినట్టు ప్రచారం చేసుకొని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. బ్రెయిన్ లేని బంటి.. పార్టీలు మారే సంటీలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులు అయ్యారని.. ఇది రాష్ట్రానికి పట్టిన దరిద్రమన్నారు. రాష్ట్రంలో అన్ని కులాలు, మతాల వారు సంతోషంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారన్నారు. ఇది ఎన్నికల సంవత్సరమని చిన్న పాము అయినా పెద్దకట్టెతో కొట్టాలని కార్యకర్తలకు సూచించారు. ఆద మరచి ఉండకూడదని, అలర్ట్‌గా ఉండాలని కరీంనగర్ పార్లమెంటు సీటును ఈసారి వదులుకునే పరిస్థితి లేదని.. ఎంపీగా బోయినిపల్లి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని సూచించారు. మతం పేరు మీద విచిత్ర రాజకీయాలు చేస్తున్న ఎంపీ బండి సంజరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. ఇలాంటి వ్యక్తిని గెలిపించుకున్నామా అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటూ మనోవేదన చెందుతున్నారని అన్నారు.
కార్యకర్తలే కొండంత అండ : మంత్రి తలసాని
కార్యకర్తలే బీఆర్ఎస్కు కొండంత అండ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని మహబూబ్ కాలేజీలోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో నిర్వహించిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనాన్ని బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. బీఆర్ఎస్ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధుల సభలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. మహబూబాబాద్ జిల్లాలోని ఆర్తి గార్డెన్లో బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మాలోతు కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు.