Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు వైఎస్ షర్మిల సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తొమ్మిదేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ ప్రజలకు ఏం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఆయనకు రాష్ట్రాన్ని పాలించడం చేతకావటం లేదని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని చంచల్ గూడ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమె ఇంటికి చేరుకోగానే విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. బంగారు తెలంగాణ సాధిస్తామంటూ చెప్పిన కేసీఆర్ సచివాలయానికి ఎప్పుడైనా వెళ్లారా? అని నిలదీశారు. రుణమాఫీ, మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇండ్లు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు తదితర హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని చెప్పారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని షర్మిల విమర్శించారు. ప్రతిపక్షాలు గొంతు విప్పితే వారిపై కేసులు పెట్టి.. జైల్లో పెట్టిస్తున్నారని వివరించారు. తాను సిట్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి పోతుంటే.. అరెస్ట్ చేయడమేంటని ప్రశ్నించారు. మహిళను అరెస్ట్ చేసే విధానం ఇదేనా? అని నిలదీశారు. ప్రశ్నించే స్వేచ్ఛ ప్రతిపక్షాలకు లేదా? అని ప్రశ్నించారు. పోలీసులు తనపై దాడులు చేస్తారనే ఉద్దేశంతోనే తోసేశానని షర్మిల అన్నారు. అంతే తప్ప తాను పోలీసులపై దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఎడిటింగ్ వీడియోలతో తనపై తప్పుడు కేసులు పెట్టారని తన తల్లి విజయలక్ష్మి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణమన్నారు. మాజీ సీఎం సతీమణి అనే కనీస గౌరవం కూడా ఆమెకు ఇవ్వలేదన్నారు. తనను ఎంత తొక్కాలని చూస్తారో.. అంత పైకి లేస్తానని షర్మిల ఈ సందర్భంగా స్పష్టం చేశారు.