Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీఎల్ఏ హామీతో రిజర్వులో ఉత్తర్వులు
నవతెలంగాణ -హైదరాబాద్
'ధరణి'లో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులపై మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ విచారణ జరిపారు. నిన్న ఆదేశాల జారీకి అనుగుణంగా చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్(సీసీఎల్ఏ) నవీన్ మిట్టల్ విచారణకు స్వయంగా హాజరయ్యారు. ధరణి పోర్టల్‌లో నమోదైన సేల్ డీడ్ల సర్టిఫైడ్ కాపీలను జారీ చేయడం లేదని దాఖలైన అనేక కేసుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడం, సమస్యల పరిష్కారానికి చర్యలేమిటో చెప్పకపోవడంపై హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. సర్టిఫైడ్ కాపీలను ఎందుకు జారీ చేయడం లేదని ప్రశ్నించింది. సర్టిఫైడ్ కాపీలు ఇవ్వకుండా దరఖాస్తులను రిజక్ట్ అనే పేరుతో ఎందుకు తిరస్కరిస్తున్నారని కూడా ప్రశ్నించింది. కొన్ని సమస్యలను వారం, మరికొన్ని 45 రోజుల్లో పరిష్కరించాలని నిబంధనల్లో ఉన్నప్పటికీ ఎందుకు అమలు చేయలేదని నిలదీసింది. ఎలాంటి కారణాలు తెలుపకుండా సర్టిఫైడ్ కాపీలు కోరిన వారికి నిరాకరిస్తూ మెసేజ్ పంపడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సమస్యలు ఎప్పుటిలోగా పరిష్కరిస్తారని నవీన్ మిట్టల్‌ను ప్రశ్నించింది.