Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో 8.35 సెంటీమీటర్ల వాన
- వచ్చే ఐదు రోజులూ వర్షం పడే సూచనలు
- కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడే అవకాశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో మంగళవారం రాత్రి పది గంటల వరకు 453కి పైగా ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వర్ష ప్రభావం కనిపించింది. నల్లగొండ, జనగామ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వాన పడింది. జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజి గిరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా ధూల్మిట్టలో అత్యధికంగా 8.35 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు కూడా తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు వడ గండ్లు కూడా పడొచ్చిని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆరెంజ్ హెచ్చరికల జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలున్నాయి. హైదరాబాద్‌లోనూ మంగళవారం పలుచోట్ల వర్షం కురిసింది. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. వాతావరణం మారిన క్రమంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువ నమోదయ్యే అవకాశముంది. మంగళవారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లోనే 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా రాయిని గూడం లో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు (మంగళవారం రాత్రి పదున్నర వరకు)
ధూల్మిట్ట (సిద్దిపేట) 8.35 సెంటీమీటర్లు
ఆర్సీ పురం (సంగారెడ్డి) 7.98 సెంటీమీటర్లు
గచ్చిబౌలి (రంగారెడ్డి) 7.75 సెంటీమీటర్లు
నందనం (యాదాద్రి భువనగిరి) 7.58 సెంటీమీటర్లు
కీసర (మేడ్చల్ మల్కాజిగిరి) 7.50 సెంటీమీట్లు