Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెచ్-52 యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులపై వేటు
- మిగిలినవారు డ్యూటీల్లో చేరాలి...లేకుంటే టెర్మినేటే..
- విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెపై యాజమాన్యం ఉక్కుపాదం
- సమ్మె ప్రభావం లేదని ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
విద్యుత్ సంస్థల్లో 200 మంది ఆర్టిజన్ కార్మికులను సర్వీస్ నుంచి తొలగించారు. 'ఎస్మా' అమల్లో ఉన్నా, నిబంధనలకు వ్యతిరేకంగా, క్రమ శిక్షణ ఉల్లంఘించి సమ్మెకు వెళ్లినందుకు వారిపై ఈ చర్యలు తీసుకున్నట్టు విద్యుత్ సంస్థల యాజమాన్యా లు తెలిపాయి. ఆర్టిజన్ల సమ్మెకు పిలుపునిచ్చిన హెచ్-52 యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు ఎస్ సాయిలు, జే శివశంకర్‌ను కూడా సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమ్మెకు వెళ్లొద్దని పలుమార్లు వారిని హెచ్చరించినా, క్రమశిక్షణ ఉల్లంఘించి, సంస్థలో పనిచేస్తున్న ఇతర ఆర్టిజన్లను రెచ్చగొట్టి, విధులు బహిష్కరించేలా ప్రేరేపించినందున వీరినీ సర్వీసు నుంచి తొలగిస్తు న్నట్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సమ్మె కొనసాగుతుందని హెచ్-52 అధ్యక్షులు సాయిలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. మరోవైపు సమ్మె పిలుపులో భాగస్వామిగా ఉన్న ఇత్తేహద్ యూనియన్ నేతలు ఆ పిలుపును ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే అదే యూనియన్‌కు చెందిన మరికొందరు నాయకులు మాత్రం అది తప్పుడు ప్రకటన అనీ, సమ్మెలో ఉన్నామని తెలిపారు. సమ్మెలో పాల్గొంటున్న ఆర్టిజన్లు ఇంకెవరన్నా ఉంటే, బుధవారం ఉదయానికల్లా విధుల్లో చేరాలనీ, లేకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని టీఎస్ జెన్కో,ట్రాన్స్‌కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎమ్‌డీలు దేవులపల్లి ప్రభాకరరావు, జీ రఘుమారెడ్డి, ఏ గోపాలరావు వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించారు. టీఎస్‌జెన్‌కోలో వందశాతం మంది ఆర్టిజన్లు విధులకు హాజరయ్యారని వారు తెలిపారు. డిస్కంలలో 80 శాతం మంది కార్మికులు విధుల్లో చేరారనీ, విద్యుత్ సరఫరాలో ఎక్కడా ఎలాంటి అవరోధాలు ఏర్పడలేదని వారు స్పష్టం చేశారు. సమ్మె ప్రభావం విద్యుత్ సంస్థలపై ఏమాత్రం లేదన్నారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే, విధుల నుంచి తప్పించేస్తామని హెచ్చరించారు.
''విద్యుత్ సంస్థల్లో ఏప్రిల్ 15 వ తేదీన పలు కార్మిక సంఘాలు ఆమోదం తెలిపిన వేతన సవరణ సరిపోలేదన్న సాకుతో కొందరు ఆర్టిజన్లు 25 ఏప్రిల్ నుండి ఇచ్చిన సమ్మె పిలుపు నేపథ్యంలో క్షేత్ర స్థాయి విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ పరిస్థితులపై సమీక్షిం చాం. సమ్మె ప్రభావం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీల మీద, వినియోగదారులపైనా లేవని నివేదికలు అందాయి'' అని సీఎమ్‌డీలు స్పష్టత ఇచ్చారు.