Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. సమస్యల పరిష్కారం కోసం మంగళవారం నుంచి తలపెట్టిన సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమ్మెకు సంఘీభావంగా అన్ని జిల్లాల్లో ఐఎఫ్టీయూ, దాని అనుబంధ శ్రేణులు కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. విద్యుత్ రంగంలోని ఆర్టిజన్ కార్మికులకు శాశ్వత ఉద్యోగులకు వర్తించే అన్ని నిబంధనలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. వారికి ఏపీఎస్ఈబీ నిబంధనలను అమలు చేయాలని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్టాండింగ్ నిబంధనలను రద్దు చేయాలని పేర్కొన్నారు. ఆర్టిజన్లకు పర్సనల్ బేసిక్‌లో డీఏ కలిపి ఫిట్మెంట్ ఇవ్వాలని సూచించారు. పీఆర్సీ-2018లో నష్టపోయిన పది శాతం కలిపి 40 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు చేస్తున్న కుట్రలను గమనించి విద్యుత్ రంగంలోని అన్ని కార్మిక సంఘాలు ఒక తాటిమీదకు రావాలని, ఐక్యంగా ఈ సమ్మెను కొనసాగించాలని కోరారు.