Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాలను చుట్టుముట్టిన పోలీసులు
- పోలీసుల కండ్లుగప్పి రోడ్డుపై బైటాయించిన రైతులు
నవతెలంగాణ కొండపాక
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలం బందారం, దర్గా, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు సాగునీరు అందించాలని కొన్నేండ్లుగా నాయకులు, అధికారులు, మంత్రి హరీశ్‌రావుకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోవడంతో గ్రామాల రైతులు ఏకమై మంగళవారం దుద్దెడ వేలికట్ట చౌరస్తాల్లో వేరువేరుగా రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రైతులను రోడ్డు ఎక్కకుండా బందారం సబ్ స్టేషన్ వద్ద పోలీసు వ్యాన్‌తో భారీ పికెటింగ్ ఏర్పాటు చేశారు. పోలీసుల కళ్లుగప్పి రైతులు దుద్దెడకు చేరుకొని రోడ్డుపై బైటాయించారు. దాంతో పోలీసులు దుద్దెడకు చేరుకొని రైతులను అరెస్టు చేసి త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆలస్యంగా చేరుకున్న మరికొందరు రైతులు అరెస్టును నిరసిస్తూ కుక్కునూరు వెళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చేర్యాల చౌరస్తా వద్ద రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న త్రీ టౌన్ పోలీసులు ఆగమేఘాల మీద చేర్యాల చౌరస్తాకు చేరుకొని ధర్నా చేస్తున్న రైతులను అరెస్టు చేసి కుకునూరుపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల నుంచి తపాసపల్లి రిజర్వాయర్ నుంచి నీరు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తూ ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి, ఎన్నికల అనంతరం ఆ హామీని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తపాసపల్లి నుంచి మర్పడగ వరకు కాలువను తవ్వి వదిలేశారని కోరారు. మూడేండ్ల కిందట కాలువ పనులు ప్రారంభించినప్పటికీ ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని తెలిపారు. కొండపాక మండలంలో నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీటిని అందిస్తామని నాయకులు ఎన్నోసార్లు చెప్పినా అమలు చేయడం లేదన్నారు. బందారం చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరు అందిస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని మూడు గ్రామాలకు నీరు అందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. అనంతరం అంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త బడెకోల్ నర్సింలు మాట్లాడుతూ.. అంకిరెడ్డిపల్లి, బందారం, దర్గా గ్రామాల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారీ మెజార్టీని అందించి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నామని, ఏ ఎన్నికల్లో పిలుపునిచ్చినా ముందుండి ఓట్లు వేయించామన్నారు. రైతుల కోసం కాకుంటే ఇంకెవరి కోసం పని చేస్తారని, సాగునీరు అందించడానికి ఇంత సమయం పడుతుందా అని ప్రశ్నించారు. నాయకులు ఎప్పుడూ రైతుల వెంబడి ఉంటారని, నేను రైతుల వెంబడే ఉంటానంటూ రైతుల ధర్నాకు మద్దతు ప్రకటించారు.