Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్రరావు
నవతెలంగాణ-ముషీరాబాద్
ఉపాధ్యాయులే నిజమైన జాతి నిర్మాతలని ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ ఆకెళ్ల రాఘవేంద్రరావు అన్నారు. గురువారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో టీచర్స్ వర్క్ షాప్ -2023 నిర్వహించారు. బాల సాహితీవేత్త చొక్కాపు వెంకటరమణ, ఎస్సీఈఆర్టీ కరికులం కమిటీ మెంబర్ సీఏ ప్రసాద్, ఆకెళ్ల రాఘవేంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులది గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన వృత్తి అని, విద్యార్థుల జీవితాన్ని సరైన దారిలో మలిచేది గురువులేనని చెప్పారు. అధ్యాపకులకు నిరంతర అభ్యాసం ఎంతో ముఖ్యమని, జ్ఞానాన్ని పంచడంతోపాటు విజ్ఞానాన్ని పెంచుకుంటూ పిల్లలకు బోధించాలన్నారు. పిల్లలను ఆలోచించే వాళ్ళుగా తయారు చేయడం, మారుతున్న సిలబస్కనుగుణంగా అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరమని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పుట్టుకతోనే పిల్లలు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోకపోతే కాలం వెనక్కి నెట్టివేస్తుందని చెప్పారు. విద్యార్థులకు సిలబస్‌తోపాటు సమాజంపై అవగాహన కలిగించేలా బోధించాలన్నారు. చదువుతోపాటు ఆట, పాట, ఇంగ్లీషు, తెలుగు భాషా పరిజ్ఞానం పెంచుకోవడానికి తగిన సూచనలు సలహాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య, నాయకులు శాంతారావు, మమతా, రూప రుక్మిణి, సుజావతి తదితరులు పాల్గొన్నారు.