Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంప్యూటర్ కోర్సులను స్థానిక విద్యార్థులు ఉపయోగించుకోవాలి
- బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ డిప్యూటీ మేనేజర్ రమేశ్‌కుమార్
- అసెంట్ స్కూల్‌కు ఐదు కంప్యూటర్ల అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో అసెంట్ స్కూల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులను ఉచితంగా అందించడం భేష్ అని బ్యాంక్ ఆఫ్ బరోడా రీజినల్ డిప్యూటీ మేనేజర్ రమేశ్‌కుమార్ కొనియాడారు. ఈ కోర్సులను స్థానిక విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని నవతెలంగాణ సాహితీ సంస్థ కార్యాలయంలో అసెంట్ స్కూల్లో టైప్‌రైటింగ్, పేజీమేకర్, క్వార్క్, ఫొటోషాప్, విజిటింగ్ కార్డ్స్ డిజైనింగ్ కోర్సులను వ్యక్తిత్వ వికాస నిపుణులు మహిపతి శ్రీనివాసరావు, నవతెలంగాణ సాహితీ సంస్థ జనరల్ మేనేజర్ కె.భరత్, ఎస్టేట్ మేనేజర్ వీరయ్య, బ్యాంక్ ఆఫ్ బరోడా టెక్నికల్ చీఫ్ మేనేజర్ వీ.ఆర్.రావు, అసెంట్ స్కూల్ ఇన్చార్జి రాములుతో కలిసి రమేశ్‌కుమార్ ప్రారంభించారు.
గతంలో శిక్షణ పొంది విజయవంతంగా కోర్సు పూర్తిచేసిన 12 మందికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా అసెంట్ స్కూల్‌కు బీఓబీ తరఫున ఆయన ఐదు కంప్యూటర్లను ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..భవిష్యత్‌లోనూ నవతెలంగాణ అసెంట్ స్కూల్‌కు తమ బ్యాంకు తరఫున సహకారాన్ని అందజేస్తామని హామీనిచ్చారు. మహిపతి శ్రీనివాస్‌రావు విద్యార్థులను చైతన్యపరుస్తూ మోటివేషన్ చేశారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో ఒక్కో మెట్టు ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రతీ విజయం ఒక్క అడుగుతోనే సాధ్యమవుతుందని చెప్పారు. భరత్ మాట్లాడుతూ..తమ సంస్థ ద్వారా రెగ్యులర్‌గా ఉచితంగా కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. ఇక్కడ శిక్షణ పొందినవారు ప్రస్తుతం అనేక రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవడం ద్వారా అనేక సంస్థల్లో ఉపాధి అవకాశాలున్నాయని చెప్పారు. ప్రతిఒక్క విద్యార్థి కూడా క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ కోర్సులను విజయవంతంగా పూర్తిచేయాలని ఆకాంక్షించారు.