Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్వీకేలో 28 వరకు నిర్వహణ
- కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) జాతీయ సమావేశాలు బుధవారం నుంచి మూడురోజులపాటు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం (ఎస్వీకే)లో జరగనున్నాయి. మంగళవారం డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, అనగంటి వెంకటేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువజన సంఘం నాయకులు హాజరవుతారని తెలిపారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ ఉన్న ఉద్యోగాలనే తొలగిస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రయివేటు వ్యక్తులకు కట్టబెడుతున్నదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు యువతను నిర్వీర్యం చేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం దేశ యువతలో మతోన్మాద విషబీజాలు నాటుతున్నదని తెలిపారు. పాఠ్యాంశాల నుంచి జాతీయ నాయకుల జీవిత చరిత్రను, డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని తొలగించటం ద్వారా విద్యార్థులను శాస్త్రీయ భావాలకు దూరం చేస్తున్నదని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం కాలయాపన చేయకుండా సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత గడువులోపు వేసిన నోటిఫికేషన్లన్నింటికీ ఉద్యోగాలు భర్తీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీర్, తిరుపతి, శివవర్మ, మల్లం మహేష్, సహాయ కార్యదర్శులు జావేద్, పెద్ది సూరి, క్రిష్ణ నాయక్, కిరణ్, యంగ్ ఉమెన్స్ కన్వీనర్ రోషిని ఖాన్ తదితరులు పాల్గొన్నారు.