Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఒకే దఫాలో రూ.2 లక్షల రుణమాఫీ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
యేటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోడీ చేసిన ప్రకటన గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరు మాట్లాడకుండా అధికారంలోకి రాగానే తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట్లాడటం విడ్డూరమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం హన్మకొండ జిల్లాలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని తీసుకొచ్చి సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా చేసిందన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తామన్న రూ.15 లక్షలు, నోట్ల రద్దుతో వెలిసి తీస్తామన్న నల్లధనం ఏమైందని ప్రశ్నించారు. మార్కెట్లో నిత్యావసర సరుకుల కృత్రిమ కొరతను సృష్టించి రేట్లు పెంచి అమ్ముకునే విధంగా అంబానీ, అదానీలకు ప్రధాని మోదీ అవకాశం కల్పిస్తున్నారన్నారు. అదానీ ఆర్ధిక నేరాన్ని గుట్టురట్టు చేసిన హిండేన్ బర్గ్ సంస్థ ఇచ్చిన నివేదిక గురించి ప్రశ్నించిన రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా కేంద్ర ప్రభుత్వం చేసిన కుట్రలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కమిషన్ వేసి కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు శాతం ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లను కల్పించగా, తెలంగాణలో దాన్ని 12 శాతానికి పెంచిన కేసీఆర్.. దాన్ని రద్దు చేస్తామన్న అమిత్‌షా వ్యాఖ్యాలను సీఎం ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకపోయినప్పటికీ వందలసార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ మనకు రావాల్సిన హక్కులను అడగకుండా స్వార్ధ రాజకీయాల కోసం రాష్ట్ర పునర్విభజన హక్కులను పణంగా పెడుతున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం వెంటనే బీసీలకు సబ్‌ప్లాన్ చట్టం తీసుకురావాలని కోరారు. తెలంగాణలో 54 శాతంగా ఉన్న బీసీలకు బడ్జెట్లో రూ.1.50 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను ఉద్దరిస్తున్నామంటే ఎలాని ప్రశ్నించారు. తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి చెందుతుందని ఆశించినా.. స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేలో 3 వేల ఎకరాలు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే దఫా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. టెక్స్టైల్స్ పార్క్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ను పంపిణీ, నిరుపేదలు సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే రూ.5 లక్షలు ఇస్తామని తెలిపారు.
ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటే కాంగ్రెస్‌ను గెలిపించుకోవాలని స్పష్టంచేశారు. సమావేశంలో హన్మకొండ డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్‌రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, టీపీసీసీ ఉపాధ్యక్షులు, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బి. శోభారాణి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.