Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెండింగ్ లేకుండా డ్రైవింగ్ లెసెన్సులు, ఆర్సీల జారీ
- నెలల తరబడి జాప్యానికి చెక్‌పెట్టేలా ఆర్టీఏ కార్యాచరణ
- వాహనదారులకు సకాలంలో కార్డులు అందేలా చర్యలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రైవింగ్ లెసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారా? నెలలు దాటుతున్నా స్మార్ట్‌కార్డు మీ ఇంటికి చేరలేదా? ఆర్సీ, డీఎల్, ఇలా సర్వీస్ ఏదైనా స్మార్ట్ కార్డు కోసం నిరీక్షిస్తున్నారా? ఇక ఆ చింత వదిలేయమని రవాణాశాఖ వినియోగదారులకు సూచిస్తోంది. గతంలో మాదిరిగా పది నుంచి 20 రోజులు కాకుండా కేవలం రెండు రోజుల వ్యవధి నుంచి వారం రోజుల లోపే వినియోగదారుని ఇంటికి డీఎల్స్, ఆర్సీలు చేరేలా చర్యలు చేపట్టినట్టు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు లైసెన్సులు, ఆర్సీ కార్డుల ప్రింటింగ్‌లో ఎలాంటి జాప్యం లేకుండా ఏ రోజుకారోజు స్మార్ట్‌కార్డులు ముద్రించడం దగ్గరి నుంచి బట్వాడా వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని చెప్పారు. జిల్లాల వారిగా ప్రింటింగ్ స్టేటస్‌ను సమీక్షించడమేకాక.. పెండింగ్ ఉన్న జిల్లా అధికారితో అప్పటికప్పుడు మాట్లాడి చర్యలు తీసుకుంటున్నారు. మొత్తానికి వినియోగదారులు మళ్లీ ఆర్టీఏ ఆఫీస్‌లకు రాకుండా సకాలంలో స్మార్ట్‌కార్డులు ఇండ్లకు చేరేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో రవాణాశాఖకు మొత్తం 54 కార్యాలయాలుండగా.. గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో 11 కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల్లో నిత్యం అయిదారు వేలకుపైగా లావాదేవీలు జరుగుతుంటాయి. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ల దగ్గరి నుంచి లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, పేరు బదాలయింపు, డూప్లికేట్ ఆర్సీ, ఫిట్నెస్ సరిఫికెట్లతో సహా వివిధ రకాల సేవల కోసం వేల సంఖ్యలో వాహనదారులు వస్తుంటారు. ఇలా ఈ సేవల నిమిత్తం వచ్చే వాహనదారులకు రవాణాశాఖ డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్సీలను స్మార్ట్‌కార్డు రూపంలో ముద్రించి అందిస్తోంది. ఇలా ప్రతినెలా సుమారు లక్షకుపైగా కార్డులను పంపిణీ చేస్తోంది. ఇందుకోసం వినియోగించే స్టేషనరీని ప్రయివేటు సంస్థల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అలాగే డీఎల్స్, ఆర్సీలను స్మార్ట్‌కార్డులుగా మార్చాక వాటిని దరఖాస్తుదారులకు నేరుగా ఇవ్వకుండా వారి చిరునామాకు తపాలా శాఖ ద్వారా పంపుతారు. ఇందుకు తపాలాశాఖ అధికారులతో ఒప్పందం చేసుకుంది. దాంతో దరఖాస్తు చేసుకున్నవారి స్మార్ట్‌కార్డులు తయారుకాగానే.. తపాలా శాఖ పది నుంచి 15రోజుల్లో చిరునామాకు పంపాలి. కానీ కొన్నేండ్లుగా సకాలంలో వాహనదారులకు కార్డులు అందడం లేదు. ప్రధానంగా నిధులు చెల్లించకపోవడం, మరోవైపు ప్రింటర్ల మొరాయింపులతో నెలల తరబడి కార్డులు ప్రింట్ కాక.. వినియోగదారులు తీవ్ర అవస్థలు పడేవారు. అత్యవసరంగా కావాల్సిన వారు రవాణాశాఖ అధికారులను స్వయంగా కలిసి కార్డులను తీసుకెళ్తుంటారు. గతంలో పోస్టల్ శాఖకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్ ఉండటంతో కార్డుల బట్వాడా నిలిపివేశారు. తాజాగా పోస్టల్ శాఖ తిరిగి కార్డుల బట్వాడా చేస్తున్నారు. కాగా, సీఎంవో కార్యాలయ అధికారి ఒకరు తన వాహన రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. వారం గడిచినా స్మార్డ్కార్డు ఇంటికి చేరకపోవడంతో ఈ విషయం ప్రభుత్వం దృష్టికిపోవడంతో సీరియస్ అయ్యింది. ఆ వెంటనే ఆర్టీఏ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. వెంటనే కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కార్డుల ముద్రణ ఆగిపోవద్దని.. ఏ రోజుకారోజు కార్డులు ప్రింటింగ్ జరగాలని, జీరో పెండింగ్ ఉండాలని హుకుం జారీ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్టీఏ సిబ్బంది రోజుకు వేలల్లో కార్డులు ముదణ్ర చేస్తున్నారు.
4 నెలల్లో 6.39 లక్షల కార్డులు బట్వాడా..
రవాణాశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 6.58లక్షల లావాదేవీలు జరగ్గా.. అందులో 6.53లక్షల లైసెన్సులు, ఆర్సీలను స్మార్ట్ కార్డు రూపంలో ముద్రించి.. 6.39లక్షల కార్డులను బట్వాడా చేశారు. మరో 14వేల కార్డులు మాత్రం డిస్పాచ్ చేయాల్సి ఉంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గ్రేటర్‌తో పాటు రాష్ట్రంలో స్మార్ట్ కార్డుల ముద్రణ ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతోంది. అంతేగాక లావాదేవీలు జరిగిన రోజు నుంచే స్మార్ట్ కార్డుల డిస్పాచ్‌కు ఆర్టీఏ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడి నుంచి మరో నాలుగైదు రోజుల్లో పోస్టల్ శాఖ ద్వారా వినియోగదారుల చిరునామాకు చేరవేస్తున్నారు. ప్రస్తుతం అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
అయితే ఆర్టీఏ ఉన్నతాధికారులు జీరో కార్డు పెండింగ్ కోసమని రోజుకు వందల్లో చేయాల్సిన ప్రింటింగ్ కాస్త వేలల్లో జరుగుతున్నది. ఫలితంగా పలు ఆర్టీఏ కార్యాలయాల్లో యంత్రాలు మొరాయిస్తు న్నాయని తెలుస్తోంది. అయితే ప్రింటర్లు పాడైన వెంటనే వాటి రిపేర్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.