Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత : తెలంగాణ రైతు సంఘం సమావేశంలో సారంపల్లి, సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ రంగంలో నెలకొన్న సమస్యల తీవ్రత వల్లే రైతులు ఇతర రంగాల వైపు పోతున్నారని తెలంగాణ రైతు సంఘం సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ లు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాద్లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మల్లారెడ్డి, సాగర్ మాట్లాడుతూ రైతుల సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీలిస్తున్న పాలకులు అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోతున్నారని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక చేసిన అప్పులు తీరక రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది దేశవ్యాప్తంగా 12,600 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. వారి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామనీ, బీమా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పే ప్రభుత్వాలు రైతుల ఆత్మహత్యలను ఎందుకు నివారించలేక పోతున్నాయని ప్రశ్నించారు. పాత అప్పుల కింద బ్యాంకులు రైతులకిచ్చే రుణాలు జమకట్టు కుంటున్నాయని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు ప్రయివేటు వ్యాపారుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారని గుర్తు చేశారు. విత్తనాలు, పురుగుమందుల్లో కల్తీ, రసాయనిక ఎరువుల ధరలపై ఇచ్చే సబ్సిడీలు ఎత్తేయడం మూలంగా రైతులపై అధిక ధరల భారం పడుతున్నదని చెప్పారు. అన్ని రంగాల్లో కార్పొరేట్లు చొరబడినట్టుగానే వ్యవసాయ రంగాన్ని కూడా ఆయా కంపెనీలకు కట్టబెట్టేందుకే కేంద్ర సర్కారు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. రైతు ప్రతిఘటనను చూసి విధిలేని పరిస్థిత్లు ఆ చట్టాలను రద్దు చేసిందన్నారు. ఢిల్లీ రైతాంగ స్ఫూర్తితో బలమైన రైతాంగ ఉద్యమాన్ని నిర్మించాలని ఈసందర్భంగా వారు పిలుపునిచ్చారు. రైతులకు అన్ని రకాల విత్తనాలు, ఎరువులను, పనిముట్లను ప్రభుత్వమే సబ్సిడీపై అందించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, పి.జంగారెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, మాదినేని రమేష్, బుర్రి శ్రీరాములు, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, కందాల ప్రమీల, బొంతు రాంబాబు, కున్రెడ్డి నాగిరెడ్డి, డి.బాల్రెడ్డి, అన్నవరపు సత్యనారాయణ, మాటురి బాలరాజు గౌడ్, శేట్ట్టిపల్లి సత్తిరెడ్డి, ఎండీ గఫూర్, పల్లపు వెంకటేష్ తదితరులు ఉన్నారు.