Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెజ్లర్ల పోరాటానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద మళ్లీ ఆందోళనకు దిగిన రెజ్లర్ల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయంగా అనేక పతకాలు సాధించి దేశానికి గౌరవాన్ని, ప్రతిష్టను తెచ్చిపెడుతున్న అగ్రశ్రేణి క్రీడాకారులైన రెజ్లర్లు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ''బేటీ బచావో బేటీ పడావో'' అంటూ ప్రవచనాలు పలుకుతున్నదని పేర్కొన్నారు. మరోవైపు ఈ దారుణమైన నేరంలో ఆరోపణలెదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్న బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ను రక్షించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవిగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. అయినా ప్రభుత్వం, పోలీసుల నుంచి స్పందనలేదని పేర్కొన్నారు. గతంలో రెజ్లర్లు ఈ విషయంపై ఆందోళన చేసిన సందర్భంగా ప్రభుత్వం కొన్ని హామీలిచ్చినప్పటికీ అమలు దిశగా చర్యలు లేకపోవడంతో వారు ఢిల్లీలో మళ్లీ ఆందోళనకు దిగాల్సి వచ్చిందని వివరించారు. బ్రిజ్ భూషణ్‌పై వెంటనే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.