Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీడీపీ అధ్యక్షులు కాసాని
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రభుత్వాన్ని కోరారు. పంట నష్టం లెక్కలను సక్రమంగా తీసి రైతులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్చి నెలలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2,28,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు ప్రభుత్వం చెప్పిందని అన్నారు. వీటిలో 1,29,446 ఎకరాల్లో మొక్కజొన్న, 72,709 ఎకరాల్లో వరి, 8865 ఎకరాల్లో మామిడి పంటలు దెబ్బతిన్నాయని పేర్కొందని చెప్పారు. పంట నష్టం జిల్లాలలో ముఖ్యమంత్రి పర్యటించిన సందర్భంలో ప్రతీ ఎకరానికి పరిహారం- నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలతోపాటు, కౌలు రైతులకు పరిహారం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు మేలు చేకూర్చేందుకు 2015 నాటి ప్రకతి వైపరీత్యాలకు సంబంధించిన జీవోను సవరించి మేలు చేస్తామని ముఖ్య మంత్రి హామీ ఇచ్చారని అన్నారు. వెంటనే సీఎం హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. కాగా ప్రభుత్వం 33శాతం మించి పంట నష్టపోయిన రైతులకే పరిహారం ఇస్తామని ప్రకటించడం సరికాదన్నారు. నష్టం 1.51లక్షల ఎకరాల్లో జరిగితే, 1,30,890 మంది రైతులే నష్టపోయారని తేల్చడం అన్యాయమని వ్యాఖ్యానించారు. 33శాతం పంట నష్టం నిబంధన పెట్టడంతో రూ.150కోట్ల పరిహారాన్ని విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.