Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు దేశవ్యాప్త నిరసనలకు ప్రజాసంఘాల పిలుపు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షులు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఢిల్లీలో పోరాటం చేస్తున్న రెజ్లర్లకు న్యాయం చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా గురువారం నిరసనలు తెలుపనున్నట్టు ప్రకటించాయి. ఈ మేరకు ఆయా ప్రజా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాలడుగు భాస్కర్(సీఐటీయూ), టి.సాగర్(తెలంగాణ రైతుసంఘం), ఆర్.వెంకట్రాములు (వ్యవసాయ కార్మిక సంఘం), మల్లు లక్ష్మి(ఐద్వా), అనగంటి వెంకటేశ్(డీవైఎఫ్ఐ), టి.నాగరాజు(ఎస్ఎఫ్ఐ) బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షులతో పాటు కొందరు కోచ్‌లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ప్రముఖ మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేసినా కేంద్రం స్పందించకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని వాపోయారు. 'బేటీ బచావో బేటీ పడావో' అంటూ సంబరాలు చేసుకుంటూనే, మరోవైపు ఈ దారుణమైన నేరంలో నిందితుడైన బీజేపీ ఎంపీని రక్షించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. న్యాయవిచారణ కోరుతున్నామని రెజ్లర్లు చెబుతున్నా కేంద్ర పట్టించుకోకపోవడం సరిగాదని తెలిపారు. మల్లయోధుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ ఫలితాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. దోషులను శిక్షించే వరకు తాము వెనక్కి తగ్గబోమని రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. నిందితులపై ఫోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెజ్లర్లకు సంఘీభావంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో జరిగే నిరసన కార్యక్రమాల్లో ప్రజలు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.