Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శాస్త్రీయ ఆలోచనలను అణచివేసే కుట్రలో భాగంగానే పాఠ్యాంశాల హేతుబద్ధీకరణలో భాగంగా పదో తరగతి సైన్స్ పుస్తకంలోని వారసత్వ పరిణామం అన్న పాఠం నుంచి జీవ పరిణామం అన్న భాగాన్ని ఎన్సీఈఆర్టీ తొలగించిందని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ విమర్శించింది. డార్విన్ సిద్ధాంతం తొలగింపును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి రామకృష్ణ, కార్యదర్శి నామాల ఆజాద్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నింపడం కోసమే 12వ తరగతి చరిత్ర పుస్తకం నుంచి మొఘలాయిల పాలనకు సంబంధించిన పాఠాలను ఎన్సీఈఆర్టీ తొలగించిందని తెలిపారు. తాజాగా పదో తరగతి పుస్తకం నుంచి డార్విన్ ప్రతిపాదించిన శారీరక పరిణామ సిద్ధాంతాన్ని తీసివేసిందని పేర్కొన్నారు. వాస్తవాలను విద్యార్థులకు అందించే శారీరక పరిణామ సిద్ధాంతాన్ని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ 1,800 మందికిపైగా శాస్త్రవేత్తలు, సైన్స్ అధ్యాపకులు, మేధావులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారని గుర్తు చేశారు. విజ్ఞానాన్ని దూరం చేసి అజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించే విధంగా పాఠ్యాంశాలను తొలగించడం సరైంది కాదని తెలిపారు. వాస్తవలను చెప్పే సైన్స్ పాఠ్యాంశాలను తొలగించి మూఢవిశ్వాసాలు, లేదా ఆర్ఎస్ఎస్ భావాలను పాఠ్యాంశాల్లో పెట్టడమంటే దేశాన్ని అబద్ధపు, అంధ దేశంగా మార్చడమేనని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.