Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజలు ఓట్లేస్తే రాజకీయ నాయకులు పదవులతో హీరోలవుతారు..లేకుంటే జీరోలే అనే విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తించుకోవాలని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సూచించారు. బుధవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రోజులూ తమ చేతుల్లోనే అధికారం ఉంటుందనేది భ్రమేనని కేటీఆర్ గుర్తించాలన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అభద్రతా భావంలోకి వెళ్లిపోయారన్నారు. అత్తసొమ్ము అల్లుడి దానం అన్నట్టుగా ఔరంగాబాద్ సభకు పెద్ద ఎత్తున యాడ్లు ఇచ్చారని విమర్శించారు. రాత్రికి రాత్రే జీవోలు తీసుకొచ్చి భూములు కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నిర్వహిస్తున్నది ఆత్మీయ సమ్మేళనాలు కాదనీ, అవి ఆత్మ వంచన సభలని విమర్శించారు. ఐటీ రంగంలో తెలంగాణనే నెంబర్ వన్ అని కేటీఆర్ చెప్పింది పచ్చి అబద్ధమన్నారు. నాలుగు లక్షల కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టుతో కర్నాటక ముందు వరుసలో ఉందనీ, కేవలం లక్ష కోట్ల రూపాయల ఎక్స్పోర్టుతో తెలంగాణ మూడో స్థానంలో ఉందని వివరించారు.