Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కొన్ని ప్రాంతాల్లో వడగండ్లు పడే అవకాశం
- పలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. రాష్ట్రంలో గురువారం కూడా గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో పాటు వడగండ్లతో కూడిన భారీ వర్షాలు కూడా అక్కడక్కడా పడొచ్చని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలను జారీ చేశారు. ఆరెంజ్ హెచ్చరికల జాబితాలో ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లో ఒకటెండ్రు ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా పడొచ్చని హెచ్చరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఈదురుగాలులు వీచాయి. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నల్లగొండ, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడా వడగండ్లు పడ్డాయి. ఐదు రోజుల కిందటితో పోలిస్తే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీల మేర తగ్గాయి. రాష్ట్రమంతటా బుధవారం 40 డిగ్రీల లోపే నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 39.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. అదే జిల్లాలోని డిచ్‌పల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లోనూ పలుచోట్ల తేలికపాటివర్షం కురిసింది. రాబోయే 48 గంటల పాటు హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది.