Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు 13 మంది సాయుధ జవాన్లు బలికావడంతో తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో హైఅలర్ట్‌ను ప్రకటించారు. ఘటన గురించి తెలియగానే ఛత్తీస్‌గఢ్‌ను ఆనుకొని ఉన్న సరిహద్దు జిల్లాల ఎస్పీలను రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టులు జరిపిన వ్యూహాత్మక దాడిలో కూంబింగ్‌కు వెళ్లి వస్తున్న ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సాయుధ పోలీసుల్లో 13 విగతజీవులు కావడం, మరికొందరు తీవ్రంగా గాయపడిన ఘటన రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను సైతం కలవర పెట్టింది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని అటవీ ప్రాంతంలో సాయుధ పోలీసు బలగాల గాలింపు చర్యలు తీవ్రతరం కావడంతో మావోయిస్టులు సరిహద్దు దాటి తెలంగాణ జిల్లాల్లోకి ప్రవేశించే ప్రమాదమున్నదని రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం అనుమానిస్తున్నది.
ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేసిన అధికారులు మరోవైపు రాష్ట్ర సరిహద్దుల్లో సాయుధ బలగాలతో గాలింపు చర్యలను విస్తృతం చేశారు. ఈ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించరాదని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ ఏరియా ఐజీతో ఎప్పటికప్పుడు సమన్వయమవుతు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా సరిహద్దు జిల్లాల ఎస్పీలకు డీజీపీ హెడ్‌క్వార్టర్స్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్ర గ్రేహౌండ్స్ అదనపు డీజీ విజరు కుమార్, రాష్ట్ర ఉత్తర రీజియన్ ఐజీ షానావాజ్ ఖాసీంలు బస్తర్ ఏరియా ఐజీ సుందర్లాల్తో మాట్లాడి ఘటనకు సంబంధించి వివరాలను సేకరించారు.