Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 3 వేల కొనుగోలు కేంద్రాల్లో 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు : సర్దార్ రవీందర్ సింగ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని పౌరసరఫరాల సంస్థ చైర్మెన్ రవీందర్ సింగ్ విమర్శించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు తెరవడం వల్లనే ధాన్యం తడిచిపోయిందన్న బండి ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి కొనుగోలు ప్రారంభించాలని ఆదేశించిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 13వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు 3,000 కేంద్రాలను ప్రారంభించి 3.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. గతేడాది ఇదే సమయానికి 93 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేసినట్టు తెలిపారు. బండి సంజరు ఆరోపణలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయనీ, వాటిని రైతులు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. ఇప్పటికే పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు అభయమిచ్చారని పేర్కొన్నారు. ప్రచారం కోసం వాస్తవాలను వక్రీకరించి మాట్లాడడం బండి సంజయ్‌కే చెల్లుబాటవుతుందని విమర్శించారు. చేతనైతే రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించేందుకు కేంద్రం నుంచి కమిటీని రప్పించాలనీ, ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చూడాలని సవాల్ చేశారు.