Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ), సింగరేణి కాలరీస్‌లో తక్షణమే కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికలను నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టు ఆదేశించిందని, గతంలో సింగరేణి ఎన్నికలపైనా ఆదేశాలున్నాయని బుధవారం ఒక ప్రకటనలో గుర్తు చేశారు. ఈ రెండు స్వాతంత్య్రం పూర్వం ఏర్పడిన సంస్థలని, తెలంగాణలో అత్యధిక మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వ రంగం సంస్థలని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్య ప్రక్రియను పరిపుష్ఠం చేసే విధానమని, దీని ద్వారా కార్మికులు, యాజమాన్యం మధ్య అంతరాలు రాకుండా సుహృద్భావ వాతావరణం నెలకొల్పబడుతుందని తెలిపారు. తద్వారా సమస్యల పరిష్కారానికి ఉపకరిస్తుందని వివరించారు.
సర్పంచ్‌లకు పెండింగ్‌లు
బిల్లులు చెల్లించాలి
రాష్ట్రవ్యాప్తంగా గ్రామపంచాయతీల్లో చేసిన పనులకు సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుకు బుధవారం ఆయన లేఖ రాశారు. ఒక్కొక్క గ్రామపంచాయతీకి రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. గ్రామాభివృద్ధి కోసం ఇతరుల నుంచి అప్పు తెచ్చి పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆ బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులకు వడ్డీలు చెల్లించలేక తీవ్ర మానసిక వ్యధకు గురవుతున్నారని తెలిపారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.