Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
- అన్నదాతల్లో భరోసా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె తారకరామారావు తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆందోళన చెందొద్దని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కష్టకాలంలో రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా రైతులకు భరోసా కల్పించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని విజ్ఞప్తి చేశారు. స్ధానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని కోరారు. ఈ మధ్యనే కురిసిన అకాల వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రైతుల విషయంలో అత్యంత సానుకూలంగా ఉండే రైతు ప్రభుత్వమని తెలిపారు. వారు ధైర్యం కోల్పోవద్దని, వారికి అండగా కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. రానున్న ఒకటి, రెండు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని అధికారులంతా క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతులకు అందుబాటులో ఉండాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.